హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని చెరువుల పరిస్థితిపై.. నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. భారీ వర్షాలు, వరదల వల్ల నగర పరిధిలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి.. నగరంలోని చెరువులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో గత వందేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు కురవడంతో పాటు.. చుట్టు పక్కల ప్రాంతాల చెరువుల నీళ్లతో ప్రభావం అధికమైందన్నారు. అన్ని చెరువులు పూర్తిగా నిండాయన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. కట్టలకు గండ్లు పండడం, తెగడం వంటి ప్రమాదాలు నివారించాలన్నారు. ప్రజలను అప్రమత్తం చేసి.. సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్న సీఎం ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు..
ఏ చెరువుకు ప్రమాదం లేదు..
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వర్షాలు, వరదలపై జలసౌధలో సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ సమీక్షించారు. ఎటా సగటున 8 వందల మిల్లిమీటర్ల వర్షం కురుస్తుందని.. ఈ ఏడాది వారం రోజుల వ్యవధిలోనే 7 వందల మిల్లిమీటర్లు పడిందన్నారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఏ చెరువుకు ప్రమాదం లేదని స్పష్టం చేశారు. అవసరమైన మరమ్మతులకు వెంటనే రూ.2 కోట్ల నిధులు వాడుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. చెరువుల కబ్జా మాట వాస్తవమే అయినా ప్రస్తుతం ఆ అంశం జోలికి వెళ్లడం లేదన్న రజత్‌కుమార్.. తర్వాత చర్యలు చేపడుతామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 46 వేల చెరువులు ఉండగా.. భారీ వర్షాలు, వరదలకు ఇరవై ఐయిదు మాత్రమే దెబ్బతిన్నాయని నీటిపారుదల శాఖ తెలిపింది.
ఇవీ చూడండి: హైదరాబాద్‌లోని చెరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్