CM KCR speech in assembly: రాష్ట్రాలు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నాయనేది ప్రగతి సూచికలో ముఖ్యమైనదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. ఆనాడు అనేక ప్రాంతాల్లో విద్యుదాఘాతాలతో ప్రజలు చనిపోయారని చెప్పారు. బిల్లులు కట్టలేదని విద్యుత్ అధికారులు దాడులు చేయబోతే కొందరు విషం తాగి చనిపోయారన్నారు. విద్యుత్ రంగం సహా అనేక సమస్యలపై పోరాడి తెలంగాణ సాధించుకున్నామని సీఎం గుర్తుచేశారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా రెండో రోజు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై కేసీఆర్ మాట్లాడారు. దేశాల విద్యుత్ వినియోగాన్ని ప్రగతి సూచికలో ముఖ్యమైనదిగా ఆధునిక ప్రపంచం పరిగణిస్తుందన్నారు.
పునర్విభజన హామీల అమల్లో తెలంగాణకు అన్యాయం చేశారని కేసీఆర్ ధ్వజమెత్తారు. విద్యుత్ కేటాయింపుల్లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరామని తెలిపారు. ఇరు రాష్ట్రాల కేటాయింపుల్లో భాగంగా లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును తెలంగాణకు అప్పగించారన్నారు. సింగరేణి కాలరీస్‌పై హక్కు తెలంగాణకే ఉంటుందని కేటాయించారని పేర్కొన్నారు. 2014లో అప్పటి ఏపీ సీఎం చేతిలో ప్రధాని కీలుబొమ్మగా మారారని వ్యాఖ్యానించారు. అప్రజాస్వామికంగా ఏడు మండలాలపై ఆర్డినెన్స్ తెచ్చారని మండిపడ్డారు. శాసనసభకు ప్రతిపాదించకుండానే కర్కశంగా 7 మండలాలను ఏపీకి అప్పగించారని ధ్వజమెత్తారు. సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కూడా వారికే కేటాయించారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'మన దేశంలో అన్ని రంగాలనూ అమ్మేస్తున్నారు. ఇంకా అమ్మేందుకు వ్యవసాయ, విద్యుత్ రంగాలే మిగిలాయి. సంస్కరణల పేరుతూ వాటినీ అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైతుల భూములను కబళించేందుకు కుట్రలు చేస్తున్నారు. కేంద్రం మాటలు వింటే సొంత పొలంలోనే రైతులు కూలీలుగా మారతారు. ధాన్యం కొనాలని కోరితే కేంద్రమంత్రులు ఎగతాళి చేస్తున్నారు. వ్యవసాయ రంగంపై కేంద్రానికి స్పష్టమైన ప్రణాళిక లేదు. నూకలు కూడా ఎగుమతి చేయకుండా నిషేధం విధించారు. కేంద్రం అసమర్థ విధానాలు, దూరదృష్టి లేకపోవడం వల్లే సాగు రంగం సమస్యల్లో ఉంది.' అని సీఎం కేసీఆర్ అన్నారు.
'అధికార మదం నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. భాజపాకు ఎప్పుడూ 50 శాతం ఓట్లు రాలేదు. ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు ఎంతో బాధపడుతున్నారు. ఇప్పటివరకు 11 రాష్ట్రాలను కూలగొట్టారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. భాజపా ప్రభుత్వం ఒక్క మంచిపని చేసిందా? సమయం వచ్చినప్పుడు ప్రజలు తమ బలం ఏంటో చెబుతారు. యువత గుండెల్లో రగిలే మంటలు ఆపగలరా? తెలంగాణలో 3 తోకలున్నాయి.. మమ్మల్ని పడగొడతామని అంటున్నారు. ప్రధాని, కేంద్రమంత్రుల అవివేక చర్యలతో దేశం ప్రమాదంలో పడింది. రైతుల భూములను కబళించేందుకు కుట్రలు జరుగుతున్నాయి.'- సీఎం కేసీఆర్
ఐదు రోజుల విరామం తర్వాత శాసనసభ సమావేశమైంది. ఏడు బిల్లులను సర్కారు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ... పురపాలక నిబంధనల చట్ట సవరణపై బిల్లులను మంత్రి కేటీఆర్... పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ పదవీవిరమణ నియంత్రణ చట్ట సవరణ బిల్లును వైద్యారోగ్య, ఆర్ధికశాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. జీఎస్టీ చట్టసవరణ బిల్లును మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, అటవీ వర్సిటీ బిల్లును ఇంద్రకరణ్ రెడ్డి.. వర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు బిల్లును విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, మోటారు వాహనాల పన్ను చట్ట సవరణ బిల్లును పువ్వాడ అజయ్... శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లులుపై రేపు చర్చచేపట్టనున్నట్లు స్పీకర్ వెల్లడించారు. అంతకుముందు పాలేరు మాజీ ఎమ్మెల్యే, దివంగత భీమపాక భూపతిరావుకు అసెంబ్లీ సంతాపం ప్రకటించింది.
ఇవీ చదవండి: