రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందన్న సీఎం... ఆ రెండు జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో చెరువులు అలుగుపోస్తున్నాయి, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల రహదార్లపైకి నీరు వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులతో సీఎం మాట్లాడారు. ఆయా జిల్లాల పరిస్థితిని సమీక్షించి తగు సూచనలు చేశారు.
హైదరాబాద్‌లో రెండు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు తమ జిల్లాల్లోనే ఉండాలని... స్థానిక కలెక్టర్, పోలీస్ అధికారులతో కలిసి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. చాలా చెరువులు పూర్తి స్థాయిలో నిండాయని ఫలితంగా కొన్ని చోట్ల చెరువులకు గండ్లు పడే అవకాశం ఉందని, వరదల వల్ల రహదార్లు తెగిపోయే ప్రమాదం ఉందని సీఎం చెప్పారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావచ్చని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం రెండు హెలికాఫ్టర్లను సిద్ధంగా ఉంచింది. వరదల వల్ల చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వాటిని వినియోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్‌తో పాటు సైనిక హెలికాప్టర్ కూడా అందుబాటులోకి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.