దాదాపు నాలుగు నెలల తర్వాత... ప్రగతి భవన్ వేదికగా అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సమావేశం కానున్నారు. గత అక్టోబర్లో జరిగిన కలెక్టర్ల సదస్సు అనంతరం ఎన్నో మార్పులు జరిగాయి. పురపాలక ఎన్నికలు, కలెక్టర్ల బదిలీ ప్రక్రియ కూడా పూర్తైంది. మెజార్టీ జిల్లాల్లో కలెక్టర్ల స్థానచలనం జరిగింది. కొంతమంది కొత్త వారిని కూడా కలెక్టర్లుగా నియమించారు. మరో దఫా పాలనా సంస్కరణలు కూడా అమలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్... జిల్లాల్లో ఇప్పటి వరకు ఉన్న సంయుక్త కలెక్టర్ల పోస్టులను తొలగించి కొత్తగా అదనపు కలెక్టర్ల వ్యవస్థను తీసుకొచ్చారు.
పల్లెలపై ప్రత్యేక దృష్టి
కొత్త పంచాయతీరాజ్, పురపాలక చట్టాలు అమలుతో కలెక్టర్ల పాత్ర క్రియాశీలకంగా మారింది. పట్టణ, గ్రామీణప్రాంత స్థానిక సంస్థల నిర్వహణలో కలెక్టర్లు మరింత కీలకమయ్యారు. స్థానికసంస్థల పర్యవేక్షణ కోసం అదనపు కలెక్టర్లను నియమించడం ద్వారా... గ్రామీణ, పట్టణాలపై ప్రభుత్వం పూర్తిస్థాయి దృష్టి సారించిందని చెప్పవచ్చు. పల్లెసీమల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా... ఇప్పటికే రెండు దఫాల్లో పల్లెప్రగతిని పూర్తి చేసింది. పనుల పురోగతిపై ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో కూడిన ఆకస్మిక తనిఖీ బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు కూడా చేశాయి.
పల్లెప్రగతి పనుల పురోగతిపై కలెక్టర్ల సదస్సులో సమీక్షించి ముఖ్యమంత్రి అవసరమైన సూచనలు చేయనున్నారు. పచ్చదనం, పారిశుద్ధ్యం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. పురపాలక ఎన్నికలు కూడా పూర్తైనందున... పట్టణ ప్రగతిని నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకొని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనున్నారు.
'రెవెన్యూ' సంస్కరణలు..
రెవెన్యూ సంబంధిత అంశాలతో ప్రజలు, రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నందున... నూతన రెవెన్యూ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది. రెవెన్యూ అధికారులకు విచక్షణాధికారాలు లేకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పారదర్శక సేవలను సత్వరం అందించేలా చట్టాన్ని రూపొందించనున్నారు. ఇందుకు సంబంధించి అమలు చేయాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోనున్నారు.
నూరుశాతం అక్షరాస్యతకు అడుగులు
రాష్ట్రంలో ఈ ఏడాది వందశాతం అక్షరాస్యతా లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న ప్రభుత్వం... ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన వయోజనుల సంఖ్య కూడా తేలింది. ఈ నేపథ్యంలో సంపూర్ణ అక్షరాస్యత దిశగా అమలు చేయాల్సిన విధానం, కలెక్టర్లు పోషించాల్సిన పాత్ర గురించి వివరించనున్నారు. ప్రాజెక్టులు-భూసేకరణ, హరితహారం తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.
ఇదీ చూడండి: దిల్లీ దంగల్ : హస్తిన పీఠం ఎవరిదో తేలేది నేడే!