కొత్త రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో సమావేశమైన సీఎం... అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. రెవెన్యూ వ్యవస్థలో ఇక నుంచి స్పష్టమైన మార్పు కనిపించాలని తెలిపారు. ప్రజలు సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతోనే కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చామని కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రజలు కేంద్ర బిందువుగా నిర్ణయాలు
ప్రజల్లో పెరిగిన చైతన్యానికి అనుగుణంగా పోలీసుశాఖలో మార్పు వచ్చిందని సీఎం తెలిపారు. అదే తరహాలో రెవెన్యూశాఖలోనూ మార్పు రావాలని సూచించారు. రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజలు కేంద్ర బిందువుగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని... అందులో భాగంగానే నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చామని స్పష్టం చేశారు. నూతన రెవెన్యూ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు.
వీఆర్వోలకు ఆప్షన్లు ఇస్తాం
మొత్తం 54 రకాల బాధ్యతలను రెవెన్యూ సిబ్బంది నిర్వహిస్తోందని సీఎం ప్రశంసించారు. ఈ శాఖలో అన్నిస్థాయిల్లో పదోన్నతుల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. తహసీల్దార్లకు కారు అలవెన్సు రెగ్యులర్‌గా ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించారు.కార్యాలయాల్లో సౌకర్యాల కల్పనకు రూ.60 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ప్రొటోకాల్ సహా కార్యాలయాల నిర్వహణకు నిధుల కొరత లేకుండా చూడాలని పేర్కొన్నారు. వీఆర్వోలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇతర శాఖల్లో చేరేందుకు ఆప్షన్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
వీఆర్‌ఏలకు పే స్కేలు ఇచ్చాం
వీఆర్ఏలలో అత్యధికంగా పేదవర్గాల వారే ఉన్నారు. వయోభారం వీఆర్‌ఏల పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పిస్తాం. మానవతా దృక్పథంతో ఆలోచించి వీఆర్‌ఏలకు పే స్కేల్ ఇవ్వాలని నిర్ణయించాం. వీఆర్‌ఏలకు పే స్కేల్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.260 కోట్లు అదనపు భారం పడుతుంది. రెవెన్యూ యంత్రాంగానికి విధి నిర్వహణలో సమస్యలు ఎదురైతే ప్రభుత్వం అండగా ఉంటుంది.
- సీఎం కేసీఆర్
ఇదీ చదవండి: ప్లానింగ్, విజనింగ్, డిజైనింగ్‌పై దృష్టి పెట్టండి: కేటీఆర్