CM KCR Honors Padmashri Thimmakka: మొక్కలు నాటి సంరక్షించడం... ప్రకృతితో మమేకమవడాన్నే జీవితంగా మార్చుకున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ పర్యావరణ వేత్త, 110 సంవత్సరాల పద్మశ్రీ తిమ్మక్కను సీఎం కేసీఆర్ సన్మానించారు. పల్లె, పట్టణ ప్రగతి అమలు సమీక్ష సమావేశానికి స్వయంగా తోడ్కొని వెళ్లిన కేసీఆర్... మంత్రులు, ప్రజాప్రతినిధులకు పరిచయం చేసి వారందరి సమక్షంలో ఘనంగా సత్కరించి, జ్ఞాపిక అందించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నారన్న తిమ్మక్క... రాష్ట్రం వ్యవసాయం, అటవీ తదితర రంగాల్లో దేశానికే తలమానికంగా నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. హరితహారం ప్రకృతికి మేలు చేస్తుందని... స్వయంగా ప్రభుత్వమే చెట్లు నాటే కార్యక్రమానికి పూనుకోవడం, నిబద్ధతగా ప్రతి సంవత్సరం మొక్కలు నాటడం, రక్షించడం లాంటి కార్యక్రమాలు కేసిఆర్‌కు ప్రకృతిపై ఉన్న బాధ్యతాయుతమైన ఆలోచనకు తార్కాణమని అన్నారు. హరితహారంలో పండ్ల మొక్కలను నాటితే మనుషులకే కాకుండా జంతువులకు మేలు చేసినవారమవుతామని తిమ్మక్క సూచించారు. అందుకు తాను పెంచిన పండ్ల మొక్కలను కూడా పంపిస్తానని తెలిపారు.
మొక్క నాటడం ఒక కార్యక్రమం కాదన్న సీఎం కేసీఆర్... అది మనల్ని, మన భవిష్యత్తు తరాలను బతికించే మార్గమని అన్నారు. ఆ బాధ్యత కోసం తన జీవితాన్నే అంకితం చేసిన తిమ్మక్కను మించిన దేశభక్తులు ఎవరూ లేరని కొనియాడారు. ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి... మంచిపనిలో నిమగ్నమైతే, గొప్పగా జీవించవచ్చని, ఆరోగ్యంతో ఉంటారనటానికి తిమ్మక్క నిలువెత్తు నిదర్శనమని... అందరూ ఆ బాటలో నడవాలని ఆకాంక్షించారు. పచ్చదనం పెంపొందించే దిశగా, అడవుల సంరక్షణ, మొక్కల పెంపకంపై ప్రభుత్వ కృషి, హరితహారం కార్యక్రమం, దాని స్ఫూర్తితో 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' వంటి కార్యక్రమాల ద్వారా జరుగుతున్న పర్యావరణ కృషిపై... సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరీ గౌరీశంకర్ సంపాదకత్వంలో పలువురు రచయితలు రాసిన వ్యాసాల సంకలనం '‘ఆకుపచ్చని వీలునామా’' పుస్తకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. తొలి ప్రతిని పర్యావరణ పరిరక్షకురాలు పద్మశ్రీ తిమ్మక్కకు అందించారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను ఆశీర్వదించిన తిమ్మక్క... తన మొక్కల వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. సౌకర్యాలు లేనప్పటికీ తాను, తన భర్త మాత్రమే మొక్కలు నాటేవారమన్న తిమ్మక్క... ఇప్పుడు డబ్బు, సౌకర్యాలు ఉన్నప్పటికీ మనుషుల్లో ప్రకృతిపై ప్రేమ తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పూర్తితో సంతోష్ చేస్తున్న వృక్ష సేవ కోట్ల మందికి చేరడం అద్భుతమని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చెట్ల నాటే కార్యక్రమాన్ని ఆపోద్దని ఎంపీ సంతోష్ దగ్గర మాట తీసుకున్నట్లు ఆమె తెలిపారు. తన 111వ పుట్టిన రోజు జూన్ 28న తిమ్మక్క గ్రీన్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న అవార్డును ఈ ఏడాది ఎంపీ సంతోష్‌కు అందిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం సంతోష్‌తో కలిసి తిమ్మక్క ప్రగతి భవన్లో మొక్క నాటారు.
ఇవీ చదవండి:రాష్ట్రాల విధుల్లో కేంద్రం జోక్యం ఎందుకు: కేసీఆర్