భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్ స్థాయి మీరి మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుని స్థాయిలో ఉండి.. అన్నీ అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. బండి సంజయ్ ఎవరి మెడలు వంచుతారో చెప్పాలని నిలదీశారు. ధాన్యం కొనేది లేదని చెప్పిన కేంద్రం మెడలు వంచుతారా? అనే స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. అడ్డందిడ్డం మాట్లాడేవారి మాటలు నమ్మి మోసపోవద్దని రైతులకు సీఎం కేసీఆర్ సూచించారు.
కార్లతో తొక్కించి చంపుతున్నారు..
ఓ వైపు దిల్లీలో ఏడాది నుంచి రైతులు ధర్నాలు చేస్తుంటే.. కేంద్రమంత్రులు వాళ్లను కార్లతో తొక్కించి చంపుతున్నారని సీఎం ఆరోపించారు. రైతులను కొట్టాలని భాజపా సీఎంలు రెచ్చగొడుతున్నారన్నారు. తెరాస ప్రభుత్వం.. అన్నదాతలకు మంచి భవిష్యత్తు ఉండాలని కృషి చేస్తుంటే.. రైతులను రోడ్లపై కూర్చొబెట్టి ధర్నాలు చేయించాలని భాజపా నాయకులు చూస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ బండి సంజయ్ రాష్ట్రానికి, జిల్లాకు ఏమైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వొద్దని సంజయ్ లేఖలు రాశారన్నారు. వరి కొంటామంటూ కేంద్రం నుంచి భాజపా నేతలు లేఖ తేవాలని కేసీఆర్ సవాల్ విసిరారు
మెడలు వంచటం కాదు.. ఇరుస్తాం..
"భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నీ అసత్యాలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలోని రైతులు వరి మాత్రమే పండించాలని చెప్తున్నారు. మెడలు వంచి కొనిపిస్తామని మాట్లాడుతున్నారు. మరీ.. బండి సంజయ్ ఎవరి మెడలు వంచుతారో చెప్పాలి. ధాన్యం కొనేది లేదని చెప్పిన కేంద్రం మెడలు వంచుతారా..? ఇలా ఇష్టమొచ్చినట్టు.. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. ఓవైపు.. మొత్తమే కొనమని రాతపూర్వకంగా కేంద్రం లేఖలు ఇస్తుంటే.. వీళ్లేమో పండించాలని రైతులను అయోమయంలో పడేస్తున్నారు. అడ్డందిడ్డం మాట్లాడేవారి మాటలు నమ్మి మోసపోవద్దు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. చాలా రోజులుగా నన్ను వ్యక్తిగతంగా నిందిస్తున్నారు. ఇష్టారీతిన నాపై ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఇన్నిరోజులు ఓపిక పట్టిన. కేసీఆర్‌ను జైలుకు పంపిస్తానని బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నన్ను ఎందుకు జైలుకు పంపిస్తారు. కేసీఆర్‌ను టచ్ చేసి.. రాష్ట్రంలో బతికి బట్ట కట్టగల్గుతారా..? అంత అహంకారమా..? మేం చేతులు ముడ్చుకుని కూర్చున్నామా..? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతారా...? దమ్ముంటే.. కేంద్రం నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆర్డర్ తీసుకురా. తీసుకొస్తే.. నేనే దగ్గరుండి విత్తనాలు పంచుతా. రాష్ట్రం మొత్తం వరి పండించేలా చూస్తా. తీసుకురాకపోతే మాత్రం.. మెడలు వంచటం కాదు.. ఇరుస్తాం. మెడలు నాలుగు ముక్కలు చేస్తాం. దిల్లీ భాజపానేమో బియ్యం కొనమని చెప్తది.. సిల్లీ భాజపా వడ్లు పండించుమంటది. రైతులను మోసం చేస్తుంటే కేసీఆర్ ఊరుకోడు. " - కేసీఆర్, సీఎం
ఇదీ చూడండి: