తెలంగాణలో కరోనాను పూర్తిగా నియంత్రించేందుకు రోజుకు 3లక్షల మంది ప్రజలకు టీకాలు ఇచ్చేలా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. దేశంలో టీకాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నందున.. మన రాష్ట్రానికీ సరిపడా సరఫరా అవుతాయన్నారు. టీకాలు ఇచ్చేందుకు పాఠశాలలు, కశాశాలలు, రైతువేదికలు తదితర ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను ఉపయోగించుకోవాలని, అవసరమైతే టెంట్లు వేసి శిబిరాలు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
టీకాల కార్యక్రమం విజయవంతానికి జిల్లా కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్షలు జరపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు సూచించారు. కలెక్టర్లతో పాటు వైద్యఆరోగ్య అధికారులు, డీపీవోలు, జెడ్పీ సీఈవోలు, ఎంపీవోల నుంచి సర్పంచుల వరకూ అందరూ వైద్యఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. ప్రస్తుతం కరోనా పూర్తి నియంత్రణలోనే ఉన్నా, భవిష్యత్‌లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా చర్యలన్నీ తీసుకుంటున్నామని తెలిపారు. టీకా ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిదనే విషయాన్ని అందరూ గమనించాలని, అప్రమత్తత పాటించాలని సూచించారు. నిర్లక్ష్యం చేసిన వారే ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. ప్రజలు స్వల్ప లక్షణాలున్నా సరే సమీప ఆరోగ్య కేంద్రాల్లో చూపించుకోవాలని, మాస్కులు తప్పక ధరించాలని కోరారు. భవిష్యత్‌లో కరోనా, ఇతరత్రా సీజనల్ వ్యాధులు సహా ఎలాంటి ఆపద వచ్చినా ప్రజలను ఆదుకోవడానికి మందులు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆక్సిజన్ ప్లాంట్లు, పడకల ఏర్పాటు విషయంలో తగు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.
ఆదివారం ప్రగతిభవన్‌లో వైద్య ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో టీకాల పురోగతిని, వైద్యఆరోగ్య శాఖకు చెందిన ఇతర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.
వైద్యం, విద్యకు ప్రాధాన్యం
‘‘రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయరంగ అభివృద్ధికి కృషిచేసింది. ఇకపై వైద్యం, విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తుంది. వైద్య కళాశాలలు, మల్టీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం పెద్దఎత్తున చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. విశిష్ట సేవలందిస్తున్న నిమ్స్ పరిధిలో మరో రెండు టవర్లు నిర్మించి వైద్యసేవలను విస్తృతం చేస్తాం. సౌకర్యాలు, శుభ్రత, ఇతర సేవల విషయంలో ప్రభుత్వ ఆస్పత్రులు కార్పొరేట్‌ను తలదన్నేలా ఉండాలి’’ అని సీఎం సూచించారు. అధికారులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా టీకాలు తీసుకోవాల్సిన వారు 2.8కోట్ల మంది ఉండగా ఇప్పటికే 1.42 కోట్ల మొదటి డోసు వ్యాక్సినేషన్, 53 లక్షల మందికి రెండో డోసు ఇచ్చామని తెలిపారు. 1.38 కోట్ల మందికి మొదటిడోసు వేయాల్సి ఉందన్నారు. విద్యాసంస్థల్లో కరోనా ప్రభావం లేదన్నారు.
ఇవీ చూడండి: 'రెండు డోసులు తీసుకున్నా.. వారిలో యాంటీబాడీలు సున్నా'