ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ప్రమాదరహితంగా పడవ ప్రయాణాలు సాగేందుకు వీలుగా పర్యటకశాఖ తొమ్మిది కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసింది. ఈనెల 18వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఈ కేంద్రాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని పర్యటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టరు ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
కమిటీ సూచనల మేరకు..
గత ఏడాది సెప్టెంబరు నెలలో కచ్చలూరు వద్ద గోదావరి నదిలో వశిష్ట పున్నమి రాయల్ పడవ ప్రమాదం జరిగిన తర్వాత నుంచి పడవ ప్రమాదాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ తర్వాత సురక్షితంగా పడవ ప్రయాణం సాగేందుకు రక్షణ చర్యలపై సూచనలు చేసేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. కమిటీ సిఫార్సుల ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లాలోని సింగనపల్లి, పేరంటాలపల్లి, పోచవరం, తూర్పుగోదావరి జిల్లాలోని గండిపోచమ్మ, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలోని రుషికొండ బీచ్, గుంటూరు జిల్లాలోని నాగార్జునసాగర్ బోటింగ్ పాయింట్, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం బోటింగ్ పాయింట్, విజయవాడలోని బెరంపార్కు వద్ద మొత్తం తొమ్మిది కంట్రోల్‌రూంలను ఏర్పాటు చేశారు. వీటిని ఏకకాలంలో ఈనెల 18న ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
ప్రతి కంట్రోల్‌రూములోనూ రెవెన్యూ శాఖకు చెందిన ఓ మేనేజరు, జలవనరులశాఖ నుంచి ఓ అధికారి, పర్యాటక శాఖ నుంచి ఒక ఆపరేటర్, తనిఖీ బృందం, లైఫ్‌గార్డ్స్, ఈతగాళ్లు, పోలీసుశాఖ నుంచి భద్రత సిబ్బంది ఉంటారు. వీరు ఎప్పటికప్పుడు జలరవాణా పాయింట్ల నుంచి పడవలను పంపించడం, వాతావరణ హెచ్చరికలు, బోటులోని సిబ్బంది, ప్రయాణికుల వివరాలను సక్రమంగా నమోదు చేయడం, పడవల రిజిస్ట్రేషన్, లైసెన్సులు, సామర్ధ్యం తనిఖీలు నిర్వహించడం... ప్రమాదాలు జరిగితే వెంటనే రక్షించేందుకు తగిన సామాగ్రి అందుబాటులో ఉంచటం, భద్రత చర్యలు పరిశీలన వంటి విధులను సిబ్బంది నిర్వహిస్తారు.
ఇవీ చదవండి: ప్రాజెక్టులకు నిధులెక్కడ?... ఆదాయం పెంచుకునే మార్గాలేవి: చంద్రబాబు