ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మొదటి విడత నాడు- నేడు పనులు ఆగస్టు 16 ప్రజలకు అంకితం చేయనున్నట్లు జగన్ తెలిపారు. ఆ రోజే రెండో విడత నాడు- నేడు పనులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.
అదే రోజు విద్యాకానుక కిట్లు
నూతన విద్యా విధానంపై సమగ్రంగా అదే రోజు జగన్ ప్రభుత్వం వివరించనుంది. ఆగస్టు 16న విద్యార్థులకు విద్యాశాఖ విద్యాకానుక కిట్లు అందజేయనుంది. కిట్‌లో ఒక్కో విద్యార్థికి 3 జతల ఏకరూప దుస్తులు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్య పుస్తకాలు ఉంటాయి. 1 నుంచి 5 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వర్క్ బుక్స్.. 6 నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగు ఇస్తామని గతంలోనే వెల్లడించారు.
ఇటీవలే సమీక్ష
జగనన్న విద్యాకానుకపై ఇటీవలే సమీక్ష నిర్వహించారు. నాడు-నేడు పథకంలో భాగంగా అభివృద్ధి చేసిన అనంతరం తీసిన ఫొటోలను ప్రదర్శించాల్సిందిగా ఏపీ ప్రభుత్వం గతంలోనే ఆదేశాలిచ్చింది. మౌలిక సదుపాయాల నిర్వహణపై ప్రామాణిక విధానాన్ని అనుసరించాలని సూచించింది. పథకాన్ని ఇంటర్, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్, ఐటీఐలు, ఇతర వైద్యారోగ్య సంస్థలకూ వర్తింపజేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం అప్పట్లోనే వెల్లడించింది.
మోగనున్న బడిగంట
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 16 నుంచి పునఃప్రారంభించాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: BE ALERT: వర్షాలు పడుతున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసా!