తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు ప్రమాదకరంగా మారిన జీవో నంబర్ 203కి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడం సహా కేంద్ర జల్‌శక్తి శాఖకు ఫిర్యాదుచేయాలని సీఎల్పీ తీర్మానం చేసింది. కాంగ్రెస్ ప్రతినిధుల ఆధ్వర్యంలో దిల్లీ వెళ్లి... నదీజలాల సమస్యలను వివరించాలని నిర్ణయించినట్లు సీఎల్పీ నేత విక్రమార్క వెల్లడించారు.
జూమ్ యాప్ ద్వారా సమావేశమైన కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) ప్రజాసమస్యలు, కరోనా కట్టడి, దళితులపై దాడులు, కృష్ణాజలాల వివాదం, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు వంటి అంశాలపై చర్చించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, పొడెం వీరయ్య, సీతక్క, రాజగోపాల్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి హాజరయ్యారు.
భారీ ఆందోళనలు..
రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులను మూసివేయాలని సీఎల్పీ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో భారీ ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సీఎల్పీ నిర్ణయించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో హోం క్వారంటైన్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరింది.
త్వరలో జిల్లా ఆస్పత్రుల సందర్శన..
త్వరలోనే జిల్లా ఆస్పత్రులను సందర్శించాలని సీఎల్పీ నిర్ణయించినట్లు భట్టి తెలిపారు. కరోనా బాధితుల కోసం గాంధీ భవన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాష్ట్రపతిని కలుస్తామని భట్టి తెలిపారు. పార్టీ ఫిరాయింపులతోపాటు, పార్టీ కార్యాలయాలను ఆక్రమించుకునే తెరాస సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం చేయనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
ఇవీచూడండి: 'ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు'