CJI NV Ramana visits Ponnavaram village: పుట్టిన ఊరు, కన్నతల్లి, మాతృభాషను ఎప్పటికీ మరిచిపోలేమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ అన్నారు. తన స్వగ్రామమైన పొన్నవరంలో జస్టిస్ ఎన్.వి రమణకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు. సీజేఐకి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు ఇచ్చారు. గజమాలతో సత్కరించారు. వివిధ రకాల బహుమతులనూ గ్రామస్థులు అందించారు. అనంతరం సీజేఐకి వెండి నాగలి బహూకరించారు.
CJI NV Ramana visits his native village: ఈ సమావేశంలో మాట్లాడిన జస్టిస్ ఎన్.వి రమణ.. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పొన్నవరం గ్రామంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తన ఉన్నతికి కుటుంబసభ్యుల సహకారం ఎంతో ఉందన్న సీజేఐ.. చిన్నప్పుడు ఉపాధ్యాయులు తనను ఎంతో ప్రేమగా చూసేవారని చెప్పారు. పొన్నవరం, కంచికచర్లలో ప్రాథమిక విద్యాభ్యాసం జరిగిందని చెప్పారు. 1967లోనే రాజకీయ చైతన్యం ఉన్న గ్రామం.. తమ పొన్నవరమన్న జస్టిస్ ఎన్.వి రమణ.. పొన్నవరం రోడ్లు, పొలాలు, చెరువులు ఇంకా గుర్తున్నాయని తెలిపారు. పొన్నవరం ప్రజల ఆశీర్వాదం కోసమే వచ్చానని అన్నారు.
'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి.. దీనికి తెలుగును జోడిస్తా. పొన్నవరం ప్రజల ఆశీర్వాదం కోసమే వచ్చా. ఎంత ఎదిగినా నా మాతృభూమిని మరిచిపోలేదు. మనదేశం అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తోంది. సమస్యలు అధిగమించాలంటే అందరూ కలిసి పనిచేయాలి. తెలుగుజాతి గొప్పతనం పదిమందికీ తెలిసేలా మనం ప్రవర్తించాలి. భారత్ బయోటెక్ అధిపతి తెలుగువారైనందుకు గర్వపడాలి. తెలుగువాళ్లు కరోనా టీకా కనుక్కోవడం మనకు గర్వకారణం. తెలుగువారికి సరైన గుర్తింపు దక్కలేదని నాకు ఆవేదన ఉంది.'
- జస్టిస్ ఎన్.వి రమణ, భారత ప్రధాన న్యాయమూర్తి
అన్ని సమస్యల పరిష్కారానికి ప్రజల ఐకమత్యమే మందు అన్నారు సీజేఐ జస్టిస్ ఎన్.వి రమణ. తెలుగువారి గొప్పదనం మరింత పెంచేలా మనం ప్రవర్తించాలని సూచించారు. తెలుగువారి గొప్పదనం గురించి దిల్లీలో అనేకమంది చెబుతారని చెప్పారు. అందరి అభిమానం, ఆశీస్సులతోనే ఈ స్థానంలో ఉన్నానని తెలిపారు. తెలుగుజాతి ఔన్నత్యం, గౌరవం మరింత పెంచాలని విజ్ఞప్తి చేశారు. మాతృభూమి మట్టివాసన సుగంధాన్ని ఆస్వాదిస్తున్నానని వ్యాఖ్యానించారు.
justice nv ramana in Suryapet : సూర్యాపేటలో సీజేఐ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అల్పాహారం తీసుకున్నారు. విజయవాడకు వెళ్తూ మార్గమధ్యలో కుటుంబసభ్యులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. సీజేఐ రాకను పురస్కరించుకుని జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సూర్యాపేటకు చేరుకున్న ఆయనకు పలువురు న్యాయమూర్తులు, కలెక్టర్ స్వాగతం పలికారు. పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: CJI Tour: సీజేఐ హోదాలో తొలిసారి సొంతూరికి జస్టిస్ రమణ.. ఘనస్వాగతం పలికిన పొన్నవరం గ్రామస్థులు