CJI Justice NV Ramana: ఏపీ హైకోర్టు ప్రాంగణంలో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సీజేఐ దంపతులను హైకోర్టు న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. సీజేఐకు హైకోర్టు సిబ్బంది పుష్పగుచ్ఛాలు, బహుమతులు అందించారు. తాను ఇక్కడే పుట్టి పెరిగిన సామాన్య వ్యక్తినని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక మందిని కలిశానని.. తనపై చాలామంది ప్రేమాభిమానాలు కురిపించారని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. కులాసాగా కూర్చుని మరోసారి మాట్లాడుకుందామని తెలిపారు.
సమాజ శ్రేయస్సు కోసం న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు త్వరలోనే కొత్త న్యాయమూర్తులను నియమించి ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ కీర్తిని ఇనుమడింపజేస్తానని మాట ఇస్తున్నానని వ్యాఖ్యానించారు.
"నేను ఇక్కడ పుట్టిపెరిగిన సామాన్యుడినే. తెలుగు రాష్ట్రాల్లోని అనేకమందిని కలిశా. నాపై చాలామంది ప్రేమాభిమానాలు కురిపించారు. అందరూ కరోనా నిబంధనలు పాటించాలి. సమాజ శ్రేయస్సు కోసం న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. హైకోర్టుకు త్వరలో కొత్త న్యాయమూర్తులను నియమిస్తాం. న్యాయవ్యవస్థ కీర్తిని ఇనుమడింపజేస్తానని మాట ఇస్తున్నా"
- సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
అమరావతికి సీజేఐ.. జాతీయ జెండాలతో ఆహ్వానం
CJI visit to Amaravathi: అంతకుముందు సీజేఐ హోదాలో తొలిసారి అమరావతికి జస్టిస్ ఎన్.వి.రమణ విచ్చేశారు. ఆయనకు అమరావతి రైతులు, ఐకాస నేతలు ఘన స్వాగతం పలికారు. రాయపూడి వద్ద కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఆకుపచ్చ కండువాలు, జాతీయ జెండాలతో సీజేఐని ఆహ్వానించారు.
న్యాయ వ్యవస్థది కీలక పాత్ర...
రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. ఉదయం విజయవాడలోని కానూరు సిద్ధార్థ కళాశాలలో దివంగత జస్టిస్ లావు వెంకటేశ్వర్లు స్మారక ఉపన్యాస సభలో ఆయన మాట్లాడారు. నాణ్యమైన విద్యతోనే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని జస్టిస్ లావు వెంకటేశ్వర్లు నమ్మేవారని చెప్పారు. స్వగ్రామంలో గ్రంథాలయాన్ని స్థాపించారని.. వాలీబాల్ తదితర క్రీడలను ఆయన ప్రోత్సహించేవారన్నారు. జస్టిస్ లావు వెంకటేశ్వర్లు ఆదర్శాలు ఆయన తనయుడు జస్టిస్ లావు నాగేశ్వరరావుకు స్ఫూర్తి అయ్యాయని చెప్పారు.
ఈ సందర్భంగా.. ‘భారత న్యాయవ్యవస్థ భవిష్యత్తు - సవాళ్లు’ అనే అంశంపై సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ ప్రసంగించారు. స్వాతంత్య్రం తర్వాత అభివృద్ధి, ఆధునికీకరణ, పారిశ్రామికీకరణ వైపు మళ్లడంలో సవాళ్లు ఎదుర్కొన్నామని చెప్పారు. ‘‘ఎన్నో సవాళ్లు మన ముందున్నాయి. రాజ్యాంగ పరిధులు తెలుసుకుని అందరూ పనిచేయాలి. జడ్జిలకు సాంకేతిక పరిజ్ఞానం చాలా ముఖ్యం. హ్యాకింగ్ అతిపెద్ద సమస్యగా మారింది’’ అని అన్నారు.
1990లో భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిందని.. సరైన సమయంలో సరైన నిర్ణయంతో దాన్ని అధిగమించామని సీజేఐ చెప్పారు. ఆ తర్వాత కొత్త పారిశ్రామిక విధానం అమల్లోకి వచ్చిందని.. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ఆర్థిక సంస్కరణలు వచ్చాయని గుర్తు చేశారు. న్యాయవ్యవస్థ కూడా ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొందన్నారు. రాజ్యాంగ పరిరక్షణలో కీలకపాత్ర పోషించాలని జస్టిస్ ఎన్.వి. రమణ పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి: