Ramineni Foundation Awards: హైదరాబాద్‌లో రామినేని ఫౌండేషన్ పురస్కార ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ, మానవీయత చాటుకున్న వ్యక్తులకు అవార్డులు అందించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2020 సంవత్సరానికి గాను... నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజు.. రామినేని విశిష్ట పురస్కారం అందుకున్నారు. విశేష పురస్కారాల కేటగిరీలో యాంకర్ సుమ, డా.మస్తాన్ యాదవ్, బండ్లమూడి శ్రీనివాస్ అందుకున్నారు. హాస్యనటుడు బ్రహ్మానందం, నిమ్స్ వైద్యురాలు దుర్గా పద్మజ, సినీ పాత్రికేయులు ఎస్వీ రామారావులకు విశేష పురస్కారాలు అందజేశారు. 2021 సంవత్సరానికిగాను విశిష్ట పురస్కారాలను కృష్ణ ఎల్ల దంపతులకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రదానం చేశారు.
మూలాలు మరవకూడదు..
CJI Justice NV Ramana: మనం ఎంత ఎదిగినా మూలాలు మరవకూడదని... మన భాష, సంస్కృతి ఔన్నత్యమే మనకు గౌరవమని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. పిల్లలకు తెలుగు భాష, సాహిత్యాన్ని అలవర్చాలని సూచించారు. తెలుగువారిని గౌరవిస్తున్న రామినేని ఫౌండేషన్ సేవలను అభినందించారు. అవార్డు గ్రహీతలందరూ వారి జీవితంలో ఎన్నో కష్టాలకోర్చి, కఠోర శ్రమతో ఈ స్థాయికి ఎదిగారని కొనియాడారు. కొవాగ్జిన్ ద్వారా తెలుగువారి ఘనకీర్తిని ప్రపంచానికి చాటిన కృష్ణ ఎల్ల దంపతులను జస్టిస్ ఎన్వీ రమణ అభినందించారు.
భారత్ నాయకత్వం వహిస్తుండటం గర్వకారణం..
Bharat Biotech md: టీకాల తయారీలో ప్రపంచానికి... భారత్ నాయకత్వం వహిస్తుండటం గర్వకారణమని భారత్ బయోటెక్ వ్యవస్థాపక ఛైర్మన్, ఎండీ కృష్ణ ఎల్ల అన్నారు. దేశం మనకేం ఇచ్చిందని ఆలోచించడం కంటే దేశానికి మనం ఏం ఇవ్వగలమనే ఆలోచనతో ముందుకు సాగాలన్నారు. కొవాగ్జిన్ విజయం భారత్ బయోటెక్ ఉద్యోగుల కృషి ఫలితమేనని... సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల చెప్పారు. రామినేని విశిష్ట పురస్కారం సమష్టి కృషికి అంకితమని కృష్ణ ఎల్ల దంపతులు పేర్కొన్నారు.
దేశం దన్నుగా నిలబడాలి
ఆవిష్కరణలకు దేశం దన్నుగా నిలబడాలి. ఆవిష్కరణలను ప్రోత్సహించకుంటే సాంకేతికత కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. మనం స్వయం ప్రతిపత్తి సాధించాలి. ఆత్మనిర్భర్ ఇప్పుడొచ్చింది కానీ 20 ఏళ్ల క్రితమే నేను దాన్ని నమ్మాను. ఇవాళ టీకాల విషయంలో భారత కంపెనీలు ప్రపంచానికే నాయకత్వం వహిస్తున్నాయి. సాంకేతికతలో యూఎస్, యూరప్ కంటే ముందున్నాం.
- సుచిత్ర ఎల్ల, భారత్ బయోటెక్ జేఎండీ.
నవ్వులు పూయించిన బ్రహ్మీ..
జస్టిస్ ఎన్వీ రమణ... పక్కవాళ్ల కష్టం, సమన్యాయం తెలిసిన వ్యక్తని హస్యనటుడు బ్రహ్మానందం కొనియాడారు. విశేష పురస్కారం అందుకున్న బ్రహ్మీ.... కాసేపు నవ్వులు పువ్వులు పూయించారు.
22 ఏళ్లుగా అవార్డుల ప్రదానం..
రామినేని అయ్యన్న చౌదరి స్ఫూర్తితో ఆయన కుమారులు 1999లో నెలకొల్పిన రామినేని ఫౌండేషన్- యూఎస్ఏ ఆధ్వర్యంలో 22 ఏళ్లుగా పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు.
ఇదీచూడండి: CJI NV RAMANA TOUR: ఈనెల 24 నుంచి స్వరాష్ట్రంలో పర్యటించనున్న సీజేఐ