రాష్ట్రంలో చౌకధరల దుకాణాల డీలర్లకు కమీషన్ కింద రూ.44.76 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు పౌరసరఫరాస సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రేషన్ కార్డులోని ఒక్కొక్కరికి ప్రతి నెలా ఇచ్చే 6 కిలోలకు అదనంగా మరో 6 కిలోల బియ్యం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ప్రభుత్వం సరఫరా చేసినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు. దాదాపు ప్రతి నెలా 3 లక్షల మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యం, నాఫెడ్ సరఫరాకు అనుగుణంగా లబ్ధిదారులకు కందిపప్పు కూడా సరఫరా చేశామని చెప్పుకొచ్చారు.
ఏప్రిల్, మే నెల్లో రేషన్ డీలర్లు అదనంగా సరఫరా చేసిన కిలో బియ్యానికి 70పైసలు, కందిప్పుకు 55 పైసల చొప్పున రూ.44.76 కోట్లు డీలర్ల ఖాతాల్లో జమచేయనున్నారు. ఈ నెల ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియ ముగిసిన తర్వాత జూన్ కమీషన్ కూడా చెల్లిస్తామని తెలిపారు. ఏప్రిల్లో 3.18 లక్షల మెట్రిక్ టన్నులకు గానూ... రూ.22.27 కోట్లు, మే నెలలో 3.26 లక్షల మెట్రిక్ టన్నులకు గానూ... రూ.22.52 కోట్లు, ఏప్రిల్, మే నెలల్లో 4,276 మెట్రిక్ టన్నుల కందిపప్పు పంపిణీ కోసం రూ. 23.52 లక్షలు చెల్లించనున్నారు.
జూన్‌లో ఇప్పటి వరకు 68.12 లక్షల కుటుంబాలకు 2.74 లక్షల మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యం సరఫరా చేయడం జరిగిందని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. గత యాసంగిలో ధాన్యం సేకరణ కోసం డీలర్ల దగ్గర తీసుకున్న గోనె సంచులకు సంబంధించిన చెల్లింపులు తక్షణం చేయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే వాన కాలం ధాన్యం సేకరణకు రేషన్ డీలర్ల నుంచి గోనె సంచులు సేకరించాలని సూచించారు.