Jyotiraditya Scindia: విమానాశ్రయాల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి.. ఆర్ధిక వృద్ధి నడవాకు ఎంతో కీలకమని కేంద్రవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. కరోనా మహమ్మారి తర్వాత వేగంగా కోలుకుని అనేక మందికి పౌరవిమానయాన రంగం ఉపాధి కల్పిస్తుందని ఆయన వివరించారు. ప్రస్తుతం విమాన ప్రయాణికుల సంఖ్య ఆశాజనకంగా ఉందని.. త్వరలో ప్రీ కోవిడ్ నంబర్స్‌కు భారత్ చేరుకుంటుందన్నారు. ఈనెల 27 నుంచి ప్రారంభమయ్యే అంతర్జాతీయ ప్రయాణాలతో ఏవియేషన్ రంగం మరింత వేగంపుంజుకోనుందని పేర్కొన్నారు.
Wings India Aviation Seminar 2022 : తెలంగాణలో హెలీప్యాడ్లు, ఎయిర్డ్రోమ్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ప్రస్తుతం 140 ఉన్న విమానాశ్రయాల సంఖ్యను 2024-25 నాటికి 220కి పెంచుతామని చెప్పారు. బేగంపేటలో రెండో రోజు కొనసాగుతున్న వింగ్స్ ఇండియా ఏవియేషన్ సదస్సుకు సింధియా హాజరయ్యారు. గత ఏడేళ్లలో భారీగా విమానాశ్రయాల సంఖ్య పెరిగిందని అన్నారు. ఏడేళ్లలో కొత్తగా 66 ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 140కి చేరిందన్న సింధియా.. ఇప్పటికే గుజరాత్లో హెలీప్యాడ్లు, ఎయిర్డ్రోమ్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
Wings India Aviation Conference 2022 : ఏవియేషన్ షోకు ఆతిథ్యమివ్వడం హైదరాబాద్‌కు గర్వకారణమని రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఏవియేషన్, ఏరోస్పేస్ సెక్టార్లు రాష్ట్రానికి ప్రాధాన్య రంగాలని తెలిపారు. ఫ్లైయింగ్ ఫర్ ఆల్ విధానానికి అనుగుణంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. పాత విమానాశ్రయాల పునరుద్ధరణకు కృషి చేస్తున్నామని చెప్పారు.
"గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి కృషిచేస్తున్నాం. వాటర్ ఎయిరో డ్రోమ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. అన్ని జిల్లాల్లో హెలీప్యాడ్ల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. డ్రోన్ పాలసీతో రాష్ట్ర ప్రభుత్వం తన విజన్‌ను చాటింది. ఎయిరో స్పేస్ తయారీ హబ్‌గా హైదరాబాద్ ఎదుగుతోంది."
- వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ఆర్ అండ్ బీ మంత్రి
మహిళలను ఏవియేషన్ వైపు ప్రోత్సహించాలని గవర్నర్ తమిళిసై అన్నారు. దేశీయ వ్యాక్సిన్ తీసుకున్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు. ఏవియేషన్ ద్వారా విదేశాలకు మన వ్యాక్సిన్లు చేరుతున్నాయని తెలిపారు. టీకాలు, ఔషధాలు, మందుల పిచికారీలకు డ్రోన్ పాలసీ దోహదం చేస్తోందని వివరించారు. డ్రోన్ల ద్వారా గిరిజన ప్రాంతాల వారికి మేలు జరుగుతోందని పేర్కొన్నారు.