CID investigation on Amaravati lands: ఆంధ్రప్రదేశ్లోని అమరావతి ప్రాంతంలో 2014-19 మధ్య కాలంలో జరిగిన అసైన్డ్ భూముల కొనుగోళ్లపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ విచారణ జరుపుతోంది. సీఐడీ అధికారుల పరిశీలనలో పెద్దగా వ్యత్యాసం కనిపించలేదని తెలిసింది. ఏపీ రాజధాని నిర్మాణంలో భాగంగా గత ప్రభుత్వం 34,400.15 ఎకరాలను భూసమీకరణ విధానంలో తీసుకుంది. ఇందులో 3,129 మంది రైతులు ఇచ్చిన 2,689.14 ఎకరాలకు సంబంధించి విచారణ జరుగుతోంది. 4, 5 కేటగిరీల్లోని భూములకు సీఆర్డీఏ అధికారులు కౌలు నిలిపివేశారు.
చేతులు మారిన కేటగిరీ-4లో 290.27 ఎకరాల మేర అసైన్డ్ భూములున్నాయి. కేటగిరీ-6లో చెరువు, వాగు పోరంబోకు భూములు 90.52 ఎకరాలున్నాయి. ఇవి పోగా మిగిలిన రైతులకు చెందిన 2,308.35 ఎకరాల భూములపై సీఐడీ అధికారులు దృష్టి సారించారు. విచారణ పూర్తికాగానే వివరాలను సీఆర్డీఏకు అందించనున్నారు. వీటిల్లో ఎలాంటి అక్రమాలు లేవని నిర్ధారణకు వచ్చిన భూములకు సంబంధించి ఇప్పటిదాకా నిలిపేసిన కౌలును చెల్లించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పట్టా భూములకు ఇప్పటికే ఓ విడత వార్షిక కౌలు కింద రూ.184 కోట్లు జమచేసిన సీఆర్డీఏ.. సోమవారం మరో 1,304 మంది రైతుల ఖాతాల్లో రూ.7.84 కోట్లు వేసింది. మరో 455.04 ఎకరాలకు సంబంధించి వివాదాలు, సివిల్ వ్యాజ్యాలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై తీర్పులను బట్టి కౌలు చెల్లింపుపై నిర్ణయం తీసుకోనుంది.