Chandrababu: ఎన్నికల్లో మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పిన వైకాపా పాలనలో ఏపీలో మద్యం, నాటుసారా ఏరులై పారుతోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కల్తీసారాను స్వయంగా వైకాపా నేతలే విక్రయిస్తున్నారన్నారని ఆరోపించారు. పక్క రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పర్యటించిన చంద్రబాబు.. కల్తీ మద్యం తాగి మృతిచెందిన వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
"మద్యం, నాటుసారా ఏరులై పారుతోంది. కల్తీసారా వైకాపా నాయకులే విక్రయిస్తున్నారు. మద్యం తయారీ నుంచి విక్రయం వరకు జగన్ చేస్తున్నారు. కల్తీ సారా నియంత్రించే వరకు పోరాటం చేస్తా."
- చంద్రబాబు, తెదేపా అధినేత
ఏపీలో మద్యం తయారీ నుంచి విక్రయం వరకు సీఎం జగనే చేస్తున్నారన్నారని చంద్రబాబు ఆరోపించారు. కల్తీ సారా నియంత్రించేవరకూ తన పోరాటం కొనసాగుతుందన్నారు. ఎందరిని జైలులో పెట్టినా కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. 26 బాధిత కుటుంబాలకు తమ పార్టీ తరఫున ఒక్కొక్కరికీ రూ. లక్ష చొప్పున సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు.
"ఎందరిని జైలులో పెట్టినా కేసులకు భయపడం. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తెదేపా ఉద్యమం చేస్తుంది. బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. కల్తీసారా వల్ల 26 కుటుంబాలు వీధిన పడ్డాయి. అనారోగ్యంతో చనిపోయారని ప్రభుత్వం చెబుతోంది. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నాటకాలు ఆడుతున్నారు. పోలీసులపై ప్రజలకు నమ్మకం పోయింది. అభద్రత మధ్య ప్రజలు బతుకుతున్నారు."
- చంద్రబాబు, తెదేపా అధినేత
18కి చేరిన మృతుల సంఖ్య..
జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు భయపెడుతూనే ఉన్నాయి. శనివారం మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించడంతో ఐదు రోజుల వ్యవధిలో మృతుల సంఖ్య 18కి చేరింది.
ఇవీచూడండి: