ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చీమకుర్తిలో గ్రానైట్ క్వారీలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన 2వేల మంది వలస కార్మికులు తమను సొంత గ్రామాలకు పంపించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. బైపాస్ రోడ్డుపై ముళ్ల కంచెలు వేసి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. తమను సొంత రాష్ట్రాలకు తరలించాలని డిమాండ్ చేశారు.
వీరిలో బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గడ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. స్పందించిన అధికారులు... వైద్యపరీక్షలు చేసి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చిస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చులతో సొంత రాష్ట్రాలకు పంపిస్తామని స్పష్టం చేశారు. అధికారుల హామీతో గ్రానైట్ కార్మికులు ఆందోళన విరమించారు.
లాక్డౌన్తో క్వారీలు, పరిశ్రమలు మూతపడిన కారణంగా..గత 40 రోజులుగా పనుల్లేక వలస కూలీలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల పరిశ్రమల నిర్వహణకు కొంత వెసులుబాటు ఇవ్వడం వల్ల వీరందరినీ మళ్లీ పనుల్లోకి తీసుకునేందుకు క్వారీ, పరిశ్రమల యజమానులు సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ తాము సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతామని కార్మికులు తేల్చి చెప్పారు.