భయపెట్టి, జరిమానాలు విధించి ఆంధ్రప్రదేశ్లో నాయకులను లొంగదీసుకుంటారా అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేల వలసలపై ఆనాడు దేవుడు స్క్రిప్ట్ రాశాడని జగన్ చెప్పిన మాటలేమయ్యాయని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా దేవుడు స్క్రిప్టు రాస్తున్నాడన్నది గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.
భయపెట్టి, జరిమానాలు విధించి...
భయపెట్టి, ప్రలోభ పెట్టి, వ్యాపారులపై జరమానాలు విధించి... నాయకులను లొంగదీసుకుంటారా అని మండిపడ్డారు. గొట్టిపాటి రవికి రూ.300కోట్ల రూపాయలు జరిమానా విధించి పార్టీలోకి రమ్మని రాయబారాలు నడుపుతున్నారని ఆరోపించారు.
తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
అచ్చెన్నాయుడుని పార్టీలోకి రమ్మని ప్రలోభాలు పెట్టి, బెదిరిస్తే... లొంగనందుకు ఆయనపై అక్రమ కేసులు పెట్టారని.. శస్త్ర చికిత్స జరిగిందని చెప్పినా మానవత్వం లేకుండా ప్రవర్తించారని దుయ్యబట్టారు. అధికార దుర్వినియోగం చేసిన ప్రతి ఒక్కరూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
శాంతిభద్రతల అంశం పెట్టకపోవటం పిరికితనం
గవర్నర్ ప్రసంగంలో శాంతిభద్రతల అంశం పెట్టకపోవటం పిరికితనమని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అడుగడుగునా ఉల్లంఘిస్తూ... ప్రజాస్వామ్యంలోని నాలుగు మూలాల వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఇష్టానుసారంగా పెడుతున్న అక్రమ కేసుల్ని ఉన్మాదం అనాలో... ఇంకేం అనాలో అర్థం కావట్లేదన్నారు. తప్పుడు కేసులతో ప్రాథమిక హక్కులు ఉల్లంఘిస్తున్నారని ధ్వజమెత్తారు.
పరీక్షలు రద్దు చేయాలి
పదోతరగతి పరీక్షలు పెడతామనటం తగదని అన్నారు. పిల్లల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు పదో తరగతి పరీక్షలు పెట్టలేదని గుర్తుచేశారు.
ఇదీ చదవండి: