CBN and Lokesh on Amaravati: ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా ప్రజా రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ 800 రోజులుగా ఉద్యమం చేస్తున్న ప్రజలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. దేశ చరిత్రలో నిలిచి పోయేలా జరుగుతున్న అమరావతి పరిరక్షణ ఉద్యమానికి తెలుగుదేశం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఒక ప్రాంతం మీద జగన్ కక్ష పెంచుకున్నారు..
రైతుల ఉద్యమానికి, పోరాటానికి తెదేపా ఎప్పుడూ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ఒక ప్రాంతం మీద కక్షను పెంచుకున్న ఏపీ ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో మొదటిసారి చూస్తున్నానని చెప్పారు. తన మూర్ఖపు వైఖరితో రాష్ట్రంలో లక్షల కోట్ల సంపదను సృష్టించే రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసిన జగన్ తప్పులను చరిత్ర ఎప్పటికీ క్షమించదని చంద్రబాబు అన్నారు. రాజధాని ప్రాంతం స్మశానం అన్న వాళ్లే.. ఇప్పుడు అమరావతి భూములను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారని విమర్శించారు. ఏపీ రాజధాని విషయంలో నిలకడ లేని నిర్ణయాలు, ముందు చూపులేని ఆలోచనలతో వ్యవహరిస్తున్న వైకాపా ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికే శాపంలా మారిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మూడు ముక్కల రాజధాని ప్రతిపాదనలను పూర్తిగా పక్కన పెట్టి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అమ్మ లాంటి అమరావతిని కూల్చేెందుకు కుట్ర..
నియంతగా మారిన పాలకుల విద్వేష నిర్ణయాలకు వ్యతిరేకంగా 800 రోజులుగా జై అమరావతి నినాదంతో మొక్కవోని దీక్షతో పోరాడుతున్న రైతులు, మహిళలు, యువతకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉద్యమాభివందనాలు తెలిపారు. రాష్ట్రానికి అమ్మ లాంటి అమరావతిని కూల్చాలని కుట్ర చేసిన జగన్ రెడ్డి అన్ని రంగాలని కుప్పకూల్చారని విమర్శించారు. సంకుచిత బుద్దితో జగన్ అండ్ కో చేసిన ప్రతీ ఆరోపణ అబద్ధమేనని నిరూపిస్తూ అమరావతి ఠీవిగా నిలబడిందని కొనియాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆపేసిన అమరావతి గ్రోత్ ఇంజిన్ ని తిరిగి మొదలు పెట్టడం ఒక్కటే మార్గమని లోకేశ్ పేర్కొన్నారు. జై అమరావతి అంటూ ఆయన ట్వీట్ చేశారు.