CBN comments on early elections: ఏపీలో ఆర్థిక విధ్వంసం జరుగుతోందని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నామని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అనేకమంది సీఎంలుగా పనిచేసినా.. జగన్ లాగ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన వారు ఎవరూ లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను దెబ్బ తీశారని ధ్వజమెత్తారు. పారిశ్రామిక వేత్తలు మొదలుకుని.. రోజూ కూలీ వరకు పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అరాచకాలను ప్రస్తుతం ప్రజలు భరిస్తున్నారని.. ఎన్నికల్లో అన్ని తేలుస్తారని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం..
ముందస్తు ఎన్నికలపై ప్రచారం జరుగుతోందని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామన్నారు. పొత్తులపై ప్రశ్నలు ఊహాజనితమని.. దానిపై స్పందించబోనని చంద్రబాబు స్పష్టం చేశారు. కరోనా కారణంగా జనం రోడ్డెక్కలేదని.. అందుకే జగన్ బతికిపోయారని అన్నారు. 175 నియోజకవర్గాలతో సమావేశమై ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామన్నారు.
పంట దిగుబడులు తగ్గుముఖం..
రాష్ట్రంలో పంట దిగుబడులు తగ్గాయని, పర్యవేక్షణలో ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉందని విమర్శించారు. ఒకప్పుడు అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రం.. దిగుబడుల్లో వెనకబడిందన్నారు. తెదేపా చేసిన అభివృద్ధి కంటే.. జగన్ ఏదో చేస్తాడని ప్రజలు భావించారన్న చంద్రబాబు.. ఇప్పుడు ఆ భ్రమలు తొలుగుతున్నాయన్నారు. గతంలో భువనేశ్వర్ నుంచి విశాఖకు వలస వచ్చే వాళ్లని.. ఇప్పుడు విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్తున్నారని చెప్పారు. ఏసీబీ, సీఐడీని నియంత్రణలో పెట్టుకుని అందర్నీ బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
పూర్తిగా నష్టపోయిన మిర్చి పంట..
రాష్ట్రంలో వ్యవసాయ పూర్తిగా దెబ్బతిందని, మిర్చి పంట పూర్తిగా నష్టపోయిందని తెలిపారు. తెదేపా హయాంలో బిందు సేద్యానికి 90శాతం సబ్సిడీ ఇచ్చామని ఇప్పుడు అస్సలు ఆ ప్రస్తావనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాక్టర్లు, వ్యవసాయ యాంత్రీకరణ విషయంలో తెదేపా ఎంతో చేసిందని.. వ్యవసాయానికి జగన్ ప్రభుత్వం చేసింది శూన్యమని ధ్వజమెత్తారు. నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు పని చేయకుంటే.. మార్పు తప్పదని హెచ్చరించారు. పని చేయని ఇన్ఛార్జీలను పక్కన పెట్టేస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి: Vanasthalipuram Accident Video: మద్యం మత్తులో కారు నడిపి.. బీభత్సం సృష్టించిన యువకుడు