హైదరాబాద్ శివారులోని శంకర్పల్లి మండలం జనవాడ గ్రామంలో ఓ మహిళ పొలం పనులకు బయల్దేరింది. ఉదయం 10 గంటల సమయంలో పొలంవైపు వెళ్తున్న క్రమంలో అక్కడే మాటు వేసి ఉన్న ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై మహిళను వెంబడించాడు. ఆమె మెడలో ఉన్న 3 తులాల గొలుసును లాక్కుని ఉడాయిద్దామనుకున్నాడు. కానీ.. దొంగ పాచిక పారలేదు. మహిళ ప్రతిఘటించింది. కేకలు వేస్తూ దొంగ చేతిని గట్టిగా పట్టుకుంది. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో దొంగ ఆమె మొఖం మీద పిడిగుద్దులతో దాడి చేశాడు. కింద పడేసి తన్నాడు. నిస్సహాయ స్థితిలో మహిళ పడిపోయింది. వెంటనే ఆ దొంగ అక్కడి నుంచి జారుకున్నాడు.
కటకటాల వెనక ఉన్నాడు..
అదే సమయంలో అటువైపు నుంచి వస్తున్న ఓ గ్రామస్థుడు ఆ మహిళను చూసి తొందరగానే విషయం గ్రహించాడు. గ్రామస్థులకు సమాచారం పంపి అప్రమత్తం చేశాడు. ఊరివాళ్లంతా పారిపోతున్న దొంగను వెంబడించి పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దొంగను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. దొంగ ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.
దొంగ పక్కూరోడే..
గొలుసు దొంగలు నగరం వదిలి గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి పెట్టడంతో పొలం పనులకు వెళ్లాలంటేనే గ్రామీణ ప్రాంత వాసులు భయపడిపోతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై నిఘా పెంచారు. దొరికిన దొంగలను దొరికినట్టు అరెస్టు చేసి పీడీ చట్టం కింద ఏడాది పాటు జైల్లో ఉండేలా చేస్తున్నారు. అయితే.. జనవాడలో గొలుసు తెంపుకొని పారిపోదామని చూసిన దొంగ పక్కగ్రామం వ్యక్తే అని పోలీసున దర్యాప్తులో తేలింది. ఈ దర్యాప్తులో భాగంగా.. పట్నం దొంగలు పల్లెల మీద దృష్టి పెట్టిన సంగతి పోలీసులు గమనించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల మీద కూడా నిఘా పెంచి ప్రజలకు రక్షణ కల్పిస్తామంటున్నారు. ప్రజలు సైతం దొంగల బెడద తప్పించి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: "12 మంది రైతులకు 'పద్మ' రావడం గొప్ప విషయం"