రాష్ట్రంలో వరదలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వరదల నష్టాన్ని అంచనా వేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర ఉన్నతాధికారుల బృందం ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనుంది. హైదరాబాద్‌లో వరదల వల్ల జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో తిరిగి అంచనా వేయనుంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ పర్యటించి పంట నష్టంపైనా.. కేంద్రానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు.. ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. సుమారు రూ.5 వేల కోట్ల మేర నష్టం జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ సాయంగా రూ. 1,350 కోట్ల విడుదల చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. సీఎం కేసీఆర్ ఇటీవల లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్రం.. వరద నష్టం అంచనా కోసం ఐదుగురు సభ్యుల బృందాన్ని రాష్ట్రానికి పంపుతోంది. ఈ అధికారులు రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి.. కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు.
కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ, కేంద్ర ఆర్థిక శాఖ కన్సల్టెంట్ ఆర్బీ కౌల్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనోహరన్, రోడ్డు, రవాణా, జాతీయరహదారుల సూపరెంటెండెంట్ ఇంజినీర్ కుశ్వాహ, కేంద్ర జలశక్తి అధికారి ఒకరు నేటి నుంచి రాష్ట్రంలో పర్యటిస్తారు.
హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా గత పదిరోజులుగా వర్షాలు కురిశాయి. ఫలితంగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. సోమవారం వరకు.. రాష్ట్రంలో వరదలతో 70 మంది మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్‌లోనూ భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. పలు చోట్ల రహదారులు కుంగిపోయాయి. వీటన్నింటినీ కేంద్ర బృందం పరిశీలించి.. కేంద్రానికి నివేదించనుంది. కేంద్ర అధికారులు.. రాష్ట్రానికి చేరుకున్న తర్వాత ఎక్కడెక్కడ పర్యటిస్తారో తెలిసే అవకాశం ఉంది.
ఇవీచూడండి: రాష్ట్రానికి కేంద్రం నుంచి బృందాలు పంపిస్తున్నాం: కిషన్ రెడ్డి