Amit Shah Tour Today: రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన ప్రారంభమైంది. మునుగోడు పర్యటనలో భాగంగా అమిత్‌షా రాష్ట్రానికి వచ్చారు. దిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్‌షాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ తదితరులు ఘనస్వాగతం పలికారు.
బేగంపేట నుంచి అమిత్‌షా నేరుగా.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకున్నారు.అమిత్‌షాకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి అమిత్‌షా ప్రత్యేక పూజలు చేశారు. అమిత్‌షా పర్యటన నేపథ్యంలో ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరినీ లోపలికి అనుమతించకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి దర్శనమనంతరం.. సాంబమూర్తినగర్‌లోని భాజపా కార్యకర్త సత్యనారాయణ ఇంటికి అమిత్‌షా వెళ్లారు. అమిత్ షాకు సత్యనారాయణ కుటుంబ సభ్యులు మంగళహారతులిచ్చి స్వాగతం పలికారు. అమిత్ షాను చూసి వారు ఉబ్బితబ్బిపోయారు. సత్యనారాయణ కుటుంబసభ్యులను అమిత్‌షాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిచయం చేశారు. కుటుంబసభ్యులను అడిగి మరీ తేనీరు సేవించారు. 15 నిమిషాలు అక్కడే గడిపిన అమిత్ షా సత్యనారాయతో పాటు కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దళితులను దారుణంగా మోసం చేస్తున్న కేసీఆర్... దళితులకిచ్చిన హామీలేవీ నెరవేర్చడం లేదని అమిత్ షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతి కార్యకర్త ఇంట్లో నేనుంటానని స్పష్టంచేసిన ఆయన.. ధైర్యంగా కొట్లాడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అమిత్‌షా రాకతో కార్యకర్త సత్యనారాయణ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
రైతు సంఘాలతో భేటీ: సత్యనారాయణ ఇంటి నుంచి అమిత్‌షా నేరుగా రమదా మనోహర్ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. పంటల కొనుగోళ్లు, ఫసల్ బీమా యోజన గురించి అమిత్ షా చర్చించారు. భారీ వర్షాల వల్ల పంటలు మునిగిపోయాయని తెలిపిన రైతులు.. ఎలాంటి రాయితీలు అందడంలేదని వాపోయారు. రాష్ట్రంలో పీఎం ఫసల్ బీమా అమలు చేయాలని రైతులు కోరారు. పీఎం కిసాన్‌ను రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచాలని అమిత్‌షాను రైతులు కోరారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రైతులకు అమిత్ షా సూచించారు.
నోవాటెల్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో సమావేశం: అనంతరం.. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మునుగోడు బయలుదేరారు. సాయంత్రం 4.40 గంటల నుంచి 4.55 గంటల వరకు సీఆర్‌పీఎఫ్ అధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో రాజగోపాల్‌రెడ్డికి అమిత్‌షా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. రాత్రి 8.30కు అమిత్‌షాతో ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ కానున్నారు. నోవాటెల్ హోటల్‌లో ఈ భేటీ జరగనుంది. అమిత్‌షా-ఎన్టీఆర్ భేటీని భాజపా వర్గాలు ధ్రువీకరించాయి. ఏయే అంశాలపై వీరిద్దరూ మాట్లాడుకుంటారు? రాజకీయ పరమైన కారణాలా? ఇతర అంశాలా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అమిత్‌షా-ఎన్టీఆర్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. వీరిద్దరి భేటీ అనంతరం.. అమిత్‌షా పార్టీ ముఖ్యనేతలతో రాత్రి 8 నుంచి 9.00 వరకు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
ఇవీ చూడండి: