Paddy Procurement in Telangana 2021: ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయబోమని తీసుకొన్న నిర్ణయం యాసంగిపైనే కాదు, వానాకాలం పంటపై కూడా ప్రభావం చూపుతోంది. కొన్నేళ్లుగా వానాకాలంలో కూడా సరాసరిన 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) తీసుకొనేది. అయితే కేంద్ర ప్రభుత్వం గత యాసంగిలో వచ్చిన ఉప్పుడు బియ్యమే పూర్తిగా తీసుకోకపోవడం... వచ్చే యాసంగి నుంచి అసలు తీసుకోబోమని స్పష్టం చేయడంతో ఆ ప్రభావం వానాకాలం ధాన్యంపై కూడా పడింది.
Central Government decision on boiled rice: 2018-19 నుంచి ఏటా వానాకాలంలో కూడా 5-6 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం కేంద్రం తీసుకుంటూ ఉండడంతో ధాన్యం తడిసినా నేరుగా మిల్లులకు తరలించేవారు. కానీ ఈ సంవత్సరం ఆ అవకాశం లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మిల్లర్లు తీసుకోడానికి నిరాకరిస్తుండడంతో పండిన ధాన్యాన్ని ఎక్కడ దాచాలో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. తడిసి రంగుమారిన ధాన్యాన్ని రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతోపాటు నిల్వ సౌకర్యం తక్కువగా ఉండడం కూడా సమస్యగా మారిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం 33 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలున్నట్లు సమాచారం. ఇందులో 19 లక్షల మెట్రిక్ టన్నులు ఉప్పుడు బియ్యం కాగా, 14 లక్షల మెట్రిక్ టన్నులు సాధారణ బియ్యం ఉన్నట్లు తెలిసింది. ఈ బియ్యాన్ని ఎఫ్‌సీఐ ఇతర రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగా మళ్లించాల్సి ఉండగా, దీనికి రైల్వే నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవల బిహార్‌కు తరలించడానికి ఎఫ్‌సీఐ ప్రయత్నించగా, రైల్వే వ్యాగన్లు కేటాయించలేదు. ఉన్న బియ్యం తరలించకపోవడంతో ప్రస్తుతం మిల్లింగ్ చేసే బియ్యం ఎక్కడ పెట్టాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని సంబంధిత వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇవీచూడండి: Paddy Procurement: వారు సొంత రిస్క్‌తో వరి సాగు చేసుకోవచ్చు: సీఎస్