Nation Education policy: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్యాసంస్థలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కారు వెల్లడించారు. ప్రతి జిల్లాకు కనీసం ఒక ఉన్నత విద్యాసంస్థ అయినా ఏర్పాటుకావాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక భాషల్లో మల్టీ డిసిప్లినరీ బోధన అందించే విద్యాసంస్థలు అవసరమన్నారు. దాంతో పాటు వృత్తి విద్యాసంస్థలు పెరగాలన్నారు.
భారత విజ్ఞాన సంపదలన్నింటినీ సమ్మిళితం చేసే పవిత్ర విద్యను అందించడమే జాతీయ విద్యావిధానం ఉద్దేశమని సుభాష్ సర్కారు స్పష్టం చేశారు. విద్యార్థులను విశ్లేషణాత్మకంగా, సునిశితంగా ఆలోచించేలా.. సమాజంలో సాంస్కృతికంగా, నైతికంగా, సామాజికంగా భాగస్వామ్యమయ్యేలా తీర్చిదిద్దాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బోధన, ఆన్లైన్ విద్య చాలా అవసరమని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 'జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఉన్నత విద్య బలోపేతం' అనే అంశంపై జరిగిన రెండు రోజుల సదస్సు ముగింపు కార్యక్రమానికి సుభాష్ సర్కారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇదీచూడండి: Niranjan Reddy Comments: 'ప్రేమలేఖలు రాసేందుకు దిల్లీకి వచ్చామా..?'