ఏటా సందడిగా సాగే నూతన సంవత్సర వేడుకలు ఈసారి మూగబోయాయి. పటాకుల శబ్దాలు, డీజే మోతలు లేకుండానే కొత్త సంవత్సరానికి ప్రజలు స్వాగతం పలికారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2021 కరోనాకు ముగింపు పలికే ఏడాదిగా మిగలాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భగవంతున్ని ప్రార్థించారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఈటల రాజేందర్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2020 మిగిల్చిన చేదు జ్ఞాపకాలు మర్చిపోయేలా 2021 ఉండాలని అభిలషించారు. 2020లో ఎదురైన ఎన్నో విపత్తులను పోలీసులు ముందుండి ఎదుర్కొన్నారన్న హైదరాబాద్ సీపీ అంజనీకుమార్.. మున్ముందు మరింత గొప్పగా సేవలు అందిస్తామని తెలిపారు. కొత్త సంవత్సరానికి వినూత్నంగా మూగసైగలతో ఆహ్వానం పలికిన అలీ, నరేశ్... అందరూ బాగుండాలి...అందులో నేనుండాలంటూ తమ సినిమా పేరిట శుభాకాంక్షలు తెలిపారు.
ఆకట్టుకున్న వేడుకలు
చాలావరకు ఈ ఏడాది కొత్త సంవత్సర కళ కనిపించకపోయినా....కొన్నిచోట్ల వేడుకలు ఆకట్టుకున్నాయి. మహబూబ్‌నగర్‌లో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ...కేసీఆర్ ఎకో పార్కును అందంగా అలంకరించారు. బహిరంగ పార్టీలకు పోలీసులు అనుమతించకపోవడంతో.... మద్యం ప్రియులు దుకాణాల వద్ద బారులు తీరి ఇళ్లకు కొనుక్కెళ్లారు. భిన్న రకాలుగా రూపొందించిన కేకులను ప్రజలు ఇళ్లవద్దే కట్ చేసి వేడుక చేసుకున్నారు.
ఇదీ చూడండి: 2021 వచ్చేసింది... కోటి ఆశలతో స్వాగతం