కరోనా పరిస్థితుల నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరంలో 30 శాతం సిలబస్‌ను తగ్గించాలని కేంద్రీయ మాధ్యమిక విద్యామండలి(సీబీఎస్‌ఈ) ప్రాథమికంగా నిర్ణయించింది. ఇంకా పలు సంస్కరణలు చేయనుంది. వీటిపై జులై 15వ తేదీ నాటికి అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనుంది. తాజాగా నిర్వహించిన ఓ వెబినార్‌లో సీబీఎస్‌ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి పాల్గొని త్వరలో చేయనున్న మార్పులను వివరించారు.
ముఖ్యమైన మార్పులు ఇవీ...
- 30 శాతం సిలబస్‌ను తగ్గిస్తారు. తగ్గింపు అంటే అధ్యాయాలను పూర్తిగా తొలగించరు. కొన్ని అంశాలను తొలగిస్తారు. అంటే పాఠ్య ప్రణాళికను హేతుబద్ధీకరిస్తారు. జులై 15వ తేదీ నాటికి పూర్తవుతుంది. జీవన నైపుణ్యాలను పాఠ్య ప్రణాళికలో చేరుస్తారు.
- బోర్డు పరీక్షల విధానాన్ని మారుస్తారు. ప్రయోగ పరీక్షల వెయిటేజీలో మార్పు ఉండదు. సమ్మేటివ్ పరీక్షలపై త్వరలో సూచనలు పంపిస్తారు.
- ఆన్‌లైన్, తరగతి గది బోధన కలిపి ఉంటుంది. ఆన్‌లైన్ తరగతులకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేస్తారు.
- ప్రాక్టికల్స్‌ను విద్యార్థులు ఇంటి వద్దనే చేసేలా మార్పు చేస్తారు. అందుకు పాఠశాలల యాజమాన్యాలు డిజిటల్ ప్రయోగశాలలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో మరోసారి లాక్డౌన్..!