MLC Anantha Babu News : మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంలో కాకినాడ జిల్లా పోలీసుల తీరుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితుడి అరెస్టులో తాత్సారం చేసి విమర్శలు మూటగట్టుకున్న పోలీసులు.. అరెస్టు సమాచారంలోనూ అత్యుత్సాహం ప్రదర్శించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను మే 23న అరెస్టు చేసే క్రమంలో సెక్షన్ 50 సీఆర్‌పీసీ కింద కాకినాడ డీఎస్పీ భీమారావు అరెస్టు సమాచారం ఇచ్చారు. ఆ పత్రంలో అనంతబాబు చిరునామా దగ్గర ‘అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు), సన్నాఫ్ చక్రరావు, కులం- కాపు/ కొండకాపు’... అని పేర్కొనడం తాజాగా చర్చనీయాంశంగా మారింది.
MLC Anantha Babu Arrest Report : రాజకీయ పలుకుబడితో కేసు నీరుగార్చడానికే పోలీసులు ఇలా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసు బలహీనపరచడానికే అనంతబాబు కులం విషయంలో కాపు/ కొండకాపు అని పోలీసులు పేర్కొన్నారని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపించారు. ఈ అంశంతోపాటు కేసులో పోలీసుల తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.
2014 శాసనసభ ఎన్నికల్లో కొండకాపు (ఎస్టీ)గా అనంతబాబు నామినేషన్ వేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆయన ఎస్టీ కాదనే వాదన తెరమీదకు రావడంతో అప్పట్లో ఆయన నామినేషన్ తిరస్కరించారు. దీంతో నామినీగా ఉన్న వంతల రాజేశ్వరిని అభ్యర్థిగా ప్రకటించాల్సి వచ్చింది. అప్పట్లో కుల ధ్రువీకరణ వ్యవహారం దుమారం రేపింది. అలాంటి వివాదాస్పద అంశాన్ని పోలీసులు మళ్లీ తెరమీదకు ఎందుకు తెచ్చారన్న ప్రశ్న ఉదయిస్తోంది. వ్యూహాత్మకమేనా.. అనే చర్చ నడుస్తోంది. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలనీ, ప్రధాన నిందితుడు అనంతబాబు శాసనమండలి సభ్యత్వాన్ని రద్దుచేయాలన్న డిమాండ్ గవర్నర్ వరకు వెళ్లడం గమనార్హం.