మంత్రిమండలిలో తీసుకున్న ఐటీ గ్రిడ్ నూతన విధానంలో భాగంగా కొన్ని ప్రోత్సాహకాలను ప్రకటించారు.
1. ఇండస్ట్రియల్ నుంచి ఐటీ పార్క్ మార్పిడిని డెవలపర్లు ఎంచుకోవచ్చు. డెవలపర్లకు 50 - 50 మార్పిడి అందించబడుతుంది. ఇందులో మొత్తం అంతర్నిర్మిత స్థలంలో గరిష్ఠంగా 50 శాతం వరకు ఐటీయేతరంగా ( నివాస లేదా వాణిజ్య ఉపయోగం ) ఉపయోగించవచ్చు. ఇండస్ట్రియల్ నుంచి ఐటీ పార్కుగా మార్చడానికి ఛార్జీలు మొత్తం భూమిపై ఐడీఏలోని ప్రాథమిక రిజిస్ట్రేషన్ విలువలో 30 శాతం చెల్లించాలి.
2. ఐటీ/ఐటీఈఎస్ సంస్థలకు యూనిట్ విద్యుత్ కు 2 రూపాయల సబ్సిడీ, గరిష్ఠంగా ఏడాదికి 5 లక్షలు దాటకుండా ఇవ్వొచ్చు.
3. ఐటీ/ఐటీఈఎస్ సంస్థలకు లీజు అద్దె మీద 30శాతం సబ్సిడీ, గరిష్ఠంగా ఏడాదికి 10 లక్షలు దాటకుండా ఇవ్వొచ్చు.
4. 500 కంటే ఎక్కువ మందికి ఉపాధినిచ్చే ఆ సంస్థలు లేదా యూనిట్ల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దిన ప్యాకేజీ అందించబడుతుంది.
రాబోయే ఐదేళ్లలో పెట్టుబడుల అంచనా:
- రాబోవు 5 ఏళ్లలో పెట్టుబడుల అంచనా ప్రకారం 100 ఎకరాల పారిశ్రామిక పార్కులు ఐటీ స్థలంగా మారుతాయని అంచనా.
- పశ్చిమ కారిడార్ వెలుపల ఉన్న ప్రాంతాలలో ( ఉప్పల్ / పోచరం / ఘట్కేసర్ / కొంపల్లి / ఇతర ప్రాంతాలు ) సుమారు 10 మిలియన్ చదరపు అడుగుల అంతర్నిర్మిత స్థలాన్ని, 1 లక్ష కొత్త ఐటీ/ఐటీఈఎస్ ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా.
వ్యవధి, పెట్టుబడి:
- పాలసీ ఇష్యూ నుంచి 5 ఏళ్ల కాలానికి గ్రిడ్ మార్గదర్శకాలు అమలులో ఉంటాయి. ఏదైనా సంస్థ ఆ 5 ఏళ్ల వ్యవధిలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన సమయం నుంచి 5 ఏళ్ల కాలానికి ప్రయోజనాలు పొందవచ్చు.
- గ్రిడ్ పాలసీకి ప్రోత్సాహకాలుగా విడుదల చేయాల్సిన మొత్తం - పదేళ్ల కాలంలో రూ . 66.75 కోట్లు.
- మార్పిడి ఛార్జీల ద్వారా డెవలపర్ల నుంచి పొందిన మొత్తం రుసుము - రూ .150 కోట్లు.
హైదరాబాద్ ఐటీ ఎగుమతులు గడచిన వార్షిక సంవత్సరం ( 2019 - 20 )కి గానూ 18 శాతం వృద్ధి సాధించి... రూ. కోటీ 18 లక్షలు నమోదు చేసుకున్నాయి. ఇది దేశ సగటు వృద్ధి (8 %) కంటే రెట్టింపు పైగా ఉండటం గమనార్హం. ఈ ఐటీ వృద్ధి 90 శాతం, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, ఆ చుట్టు ప్రక్కన ఉన్న పశ్చిమ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ కారిడార్ వెలుపల అంటే... ఉత్తరాన ( కొంపల్లి మరియు పరిసర ప్రాంతాలు ), తూర్పు ( ఉప్పల్ / పోచారం ), దక్షిణ ( విమానాశ్రయం, శంషాబాద్, ఆదిభట్ల ), నార్త్ వెస్ట్ ( కొల్లూరు / ఒస్మాన్ నగర్ ), పశ్చిమ వెలుపల ఇతర ప్రాంతాల్లో వృద్ధిని ప్రోత్సహించడానికి గ్రిడ్ విధానం ఉపకరిస్తుంది.
హైదరాబాద్ అద్భుతమైన మౌలిక సదుపాయాలను కలిగి ఉండటం వల్ల నగర బాహ్యవలయ రహాదారి చుట్టూ ఐటీని వృద్ధి చేసుకోవచ్చు. జీవన వ్యయం కూడా మాదాపూర్, కొండపూర్, గచిబౌలి లాంటి ప్రాంతాల కంటే గణనీయంగా తక్కువవుతుందని అంచనా.