Ap Cabinet Reorganization: ఈ నెల 11న ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టాలని నిర్ణయించిన సీఎం జగన్ అందుకు లాంఛనాలు పూర్తి చేస్తున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్‌కు సమాచారం ఇచ్చారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం దాదాపు అరగంటకుపైగా గవర్నర్‌తో సమావేశం అయ్యారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు కారణాలను వివరిస్తూనే.. కేబినెట్‌లోకి తీసుకోనున్నవారి వివరాలను గవర్నర్‌కు తెలిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుత మంత్రుల్లో కొందరిని మళ్లీ జట్టులోకి తీసుకునే అవకాశాలుండగా.. ఆ వివరాలనూ గవర్నర్‌కు సీఎం చెప్పినట్లు సమాచారం. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ నిర్ణయానికి ఆమోదించాలని కోరిన సీఎం.. ఈ నెల 11న కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి జరుగుతున్న ఏర్పాట్లపైనా గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది.
మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు మరో నాలుగు రోజులే గడువుంది. ఈ నెల 11 న ఉదయం 11 గంటల తర్వాత కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులుగా ఎవరెవరిని కొనసాగించాలి ? ఎవరికి కొత్తగా అమాత్య పదవి ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే సీఎం జగన్ కసరత్తు పూర్తి చేశారు. సీఎం అభీష్టం మేరకు మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండటంతో ఈ మేరకు ప్రాంతాలు, సామాజిక వర్గాలు, పార్టీకి అందించిన సేవలను ప్రాధాన్యతగా తీసుకుని కొత్త మంత్రులను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన మంత్రుల ప్రాథమిక జాబితాను గవర్నర్‌కు ఏపీ సీఎం జగన్ సమర్పించినట్లు తెలిసింది.
ఏపీలో కొత్తగా 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో జిల్లాకు ఓ మంత్రిని నియమించనున్నట్లు ఇప్పటికే సీఎం ప్రకటించారు. ప్రతి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు వారిలో మంత్రులకు అర్హత కల్గిన వారిని సామాజిక వర్గాల వారీగా ఎంపిక చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు ఎక్కడా ప్రాధాన్యత తగ్గకుండా కూర్పు చేసినట్లు తెలిసింది. వీటన్నింటిపైనా గవర్నర్ బిశ్వభూషణ్‌తో సీఎం చర్చించినట్లు తెలిసింది. జిల్లాల వారీగా ఎవరికి మంత్రిగా అవకాశం ఇవ్వాల్సి వచ్చింది., వారి అర్హత లేమిటి., సామాజిక వర్గం పరంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చింది. తదితర అంశాలపై గవర్నర్‌తో సీఎం చర్చించారు.
ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఐదుగురు లేక ఆరుగురు మంత్రులను తిరిగి కొనసాగించాలని సీఎం నిర్ణయించారు. కొన్ని సామాజిక వర్గాల్లో కేవలం ఒకరు మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి వారికి తిరిగి మంత్రులుగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. కొన్ని సామాజిక వర్గాల్లో కేవలం ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరిలో బలమైన నేత, పార్టీకి అందించిన సేవలు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తిరిగి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాలను గవర్నర్‌కు సీఎం వివరించినట్లు తెలిసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ప్రస్తుతం ఉన్న మంత్రులందరితో రాజీనామాలు తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు సమాచారం. కీలక నిర్ణయం కావడంతో దీనిపై ముందస్తుగా గవర్నర్ అనుమతి తీసుకున్నట్లు తెలిసింది.
మంత్రులందరి రాజీనామాలు తీసుకుని తదుపరి గవర్నర్‌ను కలిసి సీఎం జగన్ వాటిని సమర్పించనున్నారు. అనంతరం మంత్రులుగా కొనసాగించే వారి పేర్లతో కలిపి కొత్త మంత్రుల తుది జాబితా ఇవ్వనున్నారు. దీని ప్రకారం ఈ నెల 11న మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్‌ను సీఎం ఆహ్వానించినట్లు సమాచారం. దీనికోసం తగిన ఏర్పాట్లు చేయాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిసింది. వీటితో పాటు జిల్లాల పునర్విభజన అంశాల విషయంలో తీసుకున్న ప్రాధాన్యతలు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న వైనం, జిల్లాల పేర్లు తదితర అంశాలపైనా గవర్నర్‌తో సీఎం జగన్ చర్చించినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: ప్రజారోగ్య వైద్యంలో గుణాత్మక పురోగతి: సీఎం కేసీఆర్