రన్నింగ్లో ఉండగానే ఆర్టీసీ బస్సు చక్రాలు (Bus Wheels) ఊడిపోయిన ఘటన ఏపీ అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం జిల్లాలోని విడపనకల్ మండలం పాల్తూరు నుంచి చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులను, ప్రయాణికులను ఎక్కించుకొని హవళిగి వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు రన్నింగ్లో ఉండగానే ఒక్కసారిగా వెనుక చక్రాలు ఊడిపోయాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును అదుపు చేయడం వల్ల పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రోడ్డుపక్కన ఉన్న ద్విచక్రవాహనాన్ని బస్సు లాక్కొని వెళ్లింది. ప్రయాణికులు, విద్యార్థులను మరొక బస్సులో తమ గమ్యస్థానాలకు చేర్చారు. ఫిట్‌నెస్ లేని బస్సులను ఉపయోగించడం.. కాలం చెల్లిన బస్సులను వాడటం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.
నాలుగు రోజుల కిందట...
ఏపీలో ఆర్టీసీ బస్సుల నాణ్యతపై ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఒక్కడో ఒకచోట ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా అనంతపురంలో బస్సు చక్రాలు ఊడిపోగా... నాలుగు కిందట తూర్పు గోదావరి జిల్లా గోకవరం నుంచి పాతకోట వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు వెనుక చక్రాలు ఊడి పక్కకు వెళ్లిపోయాయి. బస్సు అక్కడే నిలిచిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు.. ప్రయాణికులను వేరే వాహనంలో గమ్యస్థానాలకు చేర్చారు.
ఆర్టీసీ బస్సు ప్రమాదంపై మంత్రి పేర్ని నాని ఆరా తీశారు. బస్సుల ఫిట్‌నెస్ విషయాల్లో తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కాగా బాధ్యులపై చర్యలకు ఆదేశించినట్లు మంత్రికి ఆర్టీసీ ఎండీ వివరించారు. బస్సు ప్రమాదంపై మంత్రి ఆదేశించిన నాలుగు రోజులకే మరో బస్సు చక్రాలు ఊడిపోవడం చర్చనీయంశంగా మారింది.
ఇదీ చూడండి: HIGH COURT: గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు