ఏపీ చిత్తూరు జిల్లా రేణిగుంట పరిధిలోని తారకరామనగర్‌లో పేలుడు పదార్థం కలకలం సృష్టించింది. పశువులను కాసే క్రమంలో శశికుమారి అనే మహిళ రైలు పట్టాలపైకి వచ్చింది. పట్టాలపై ఉన్న డబ్బా పేలి ఆమెకు గాయాలయ్యాయి. శశికళను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పేలుడు జరిగిన స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. అడవి పందుల కోసం పెట్టిన నాటుబాంబుగా పోలీసులు భావిస్తున్నారు. పేలుడు పదార్థంపై పరీక్షలు పూర్తయ్యాక మరిన్ని వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.
- ఆ డబ్బా వెల్డింగ్ పరిశ్రమది: ఎస్పీ
పేలుడు కారణాలను పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. వెల్డింగ్ పనులకు వాడే మిథైల్, ఈథైల్ కీటో పెరాక్సైడ్‌గా గుర్తించామని ఎస్పీ రమేశ్ రెడ్డి చెప్పారు. బాలాజీ వెల్డింగ్ వర్క్స్‌లో హీట్ రెసిస్టింగ్ పనులు చేస్తారని.. వెల్డింగ్ పరిశ్రమలోని ఖాళీ డబ్బాను నిర్మానుష్య ప్రదేశంలో పడేశారన్నారు. ఆ డబ్బాయే రైల్వే ట్రాక్ పక్కన పేలిన పదార్థంగా ప్రాథమికంగా గుర్తించామని ఎస్పీ వెల్లడించారు. రసాయన డబ్బాను జాగ్రత్తగా డిస్పోజ్ చేయాల్సిన బాధ్యత పరిశ్రమదేనని స్పష్టం చేశారు. వెల్డింగ్ పరిశ్రమ యజమానిపై కేసు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు.
ఇదీ చూడండి: భారత్ బంద్‌ను విజయవంతం చేసిన విపక్షాలు