రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలనే డిమాండ్‌తో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష మొదలైంది. నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయం వేదికగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఈ దీక్షను ప్రారంభించారు. ముందుగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. బండి సంజయ్‌తో పాటు పదాధికారులు, విజయశాంతి, స్వామిగౌడ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భాజపా కార్యాలయం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
600 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా.. సీఎం కేసీఆర్ కళ్లకు కనిపించడం లేదని బండి సంజయ్ విమర్శించారు. నిరుద్యోగ దీక్షకు తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. కొవిడ్ నిబంధనలకు లోబడి దీక్ష చేపడుతుంటే ప్రభుత్వానికున్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. 'నిరుద్యోగ దీక్ష’తో తెరాస పీఠం కదిలిపోతుందనే భయంతోనే ఈ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.