ధాన్యం కొనుగోలుకు గోనె సంచులను త్వరగా అందించాలని, కాంటాలు, లోడింగ్, ఆన్ లోడింగ్‌కు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. ఇవాళ సీఎస్‌కు ఫోన్ చేసిన సంజయ్... రాష్ట్రంలోని ప్రధాన సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకొని తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు కొన్ని చోట్ల డ్రా విధానం, కొన్ని చోట్ల టోకెన్ విధానం ఉండటం వల్ల రైతుల్లో గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు.
వరికి రూ. 1835 మద్దతు ధర ఇచ్చినప్పటికీ సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల రైతులు తక్కువ ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన రేషన్ సామాగ్రి రాష్ట్రంలో అందడంలేదన్నారు. కింది స్థాయి అధికారులకు పూర్తి వివరాలు అందకపోవడం వల్ల గందరగోళం చోటుచేసుకుందని వాపోయారు. వలస కూలీలకు బియ్యం, నగదు, నిత్యావసర సరకులు అందించాలని కోరారు. లాక్డౌన్ కాలంలో అత్యవసర సేవల కోసం ఫీల్డ్ అసిస్టెంట్స్‌ను విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా భాజపా కార్యకర్తలు ప్రతి రోజు ఐదుగురికి నిత్యావసర వస్తువులు, అన్నదానం చేస్తున్నారని వివరించారు.
ఇదీ చూడండి: మనమరాలికి కిడ్నీ సమస్య..యాచకుడిగా మారిన తాత