భాజపాను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేటి నుంచి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేయనున్నారు. ఛార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్రకు శ్రీకారం చేపట్టనున్నారు. పాదయాత్ర వేదికగా ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై సమరశంఖం పూరించడమే లక్ష్యంగా పాదయాత్ర కొనసాగనుంది. తెరాస ప్రభుత్వ ప్రజావ్యతిరేక, నిరంకుశ విధానాలను, కుటుంబ పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే సంస్థాగతంగా పార్టీని బలోపేతంచేస్తూ 2023లో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా... ‘ప్రజా సంగ్రామ యాత్ర సాగనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యాత్ర విజయవంతానికి రాష్ట్ర నాయకత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. పాదయాత్ర ప్రముఖ్ మనోహర్‌రెడ్డి జిల్లాల వారీగా పార్టీనేతలతో సమీక్షలు జరుపుతూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పాదయాత్ర విజయవంతానికి 29 కమిటీలు ఏర్పాటు చేశారు. సీనియర్ నేతలతోపాటు పాత, కొత్త నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ప్రజా సంగ్రామ యాత్ర శంఖారావ సభకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సహా పలువురు పార్టీ సీనియర్ నేతలు హాజరుకానున్నారు.
అక్టోబర్ 2న ముగియనున్న పాదయాత్ర
తొలిరోజు పాదయాత్రలో భాగంగా బండి సంజయ్... ఉదయం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని వేములవాడ రాజన్న ఆలయవేద పండితుల ఆశీస్సులు తీసుకుంటారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో జంటనగరాల బ్రాహ్మణ సంఘాల ఆధ్యర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభాప్రాంగణానికి చేరుకొని సమరశంఖం పూరిస్తారు. ఆ తర్వాత తరుణ్‌చుగ్ జెండా ఊపి పాదయాత్రను లాంఛనంగా ప్రారంభిస్తారు. మెహిదీపట్నం సమీపంలోని పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో రాత్రి బసతో తొలిరోజు యాత్ర ముగుస్తుంది. రోజుకు సగటున 10 నుంచి 15 కిలోమీటర్ల చొప్పున 35 రోజులపాటు సాగనుంది. అక్టోబర్ 2న.... హుజూరాబాద్ సభతో తొలివిడత ప్రజా సంగ్రామ యాత్ర ముగుస్తుంది. ఆ లోపు హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడితే పాదయాత్ర రూట్‌మ్యాప్ మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2023 ఎన్నికల వరకు విడతల వారీగా ప్రజాసంగ్రామ యాత్రను చేపట్టనున్నట్లు భాజపా నేతలు వెల్లడించారు.
ఇదీ చదవండి: Viral Video: ఫోన్ ఎత్తుకెళ్లి.. సిటీని వీడియో తీసిన చిలుక!