రానున్న వరుస ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమలదళం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. కేంద్రమంత్రులతో ప్రచారం.. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిన సాయంపై వారితో చెప్పించాలని వ్యూహరచన చేస్తోంది. రవిశంకర్‌ప్రసాద్, ప్రకాశ్ జావడేకర్, కిషన్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు కేంద్రమంత్రులు వచ్చే అవకాశాలున్నట్లు కమలనాథులు చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థిగా రఘునందన్‌రావు పేరు దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. హెచ్‌ఏఎల్ డైరెక్టర్ ఎస్.మల్లారెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యుడు పేరాల శేఖర్‌రావు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు.
అయితే సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్‌రావునే మళ్లీ బరిలోకి దింపుతున్నట్లు ఆయనకు పార్టీ నాయకత్వం నుంచి సంకేతాలు అందినట్లు సమాచారం. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు.. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానాన్నీ గెలుచుకోవాలని భాజపా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేస్తోంది. 150 డివిజన్లలో పార్టీకి బలం ఎక్కడెక్కడ ఉంది.. అనే అంశంతో పాటు స్థానికంగా పార్టీ నేతల్లో ఎవరికి ప్రజల్లో ఆదరణ ఉందనే అంశాలపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రత్యేకంగా సర్వే చేయిస్తున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో తెజాస:కోదండరాం