తెలంగాణలో అంత్యక్రియల పేరుతో అధికార పార్టీ చేస్తున్న మత రాజకీయాలు సరి కావని భాజపా రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వం విడుదల చేసిన జీవో 169ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్19 వ్యాధితో చనిపోయిన మృతదేహాలను ఖననం చేయడానికి విడుదల చేసిన మార్గదర్శకాలు హిందువుల మత సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 169 జీవో ఒక వర్గాన్ని సంతృప్తి పర్చడం కోసం ఇచ్చినట్లు ఉందని విమర్శించారు. మెజారిటీ హిందువుల మనోభావలను గౌరవించకపోవడం శోచనీయమన్నారు. కొవిడ్19తో చనిపోతే ఐదుగురితోనే అంత్యక్రియలు చేయాలని నిబంధన పెట్టడం హిందువుల సంప్రదాయాలకు సరికాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హిందూ సంప్రదాయం ప్రకారం చేయాల్సిన దహన కార్యక్రమాలకు అవసరమైన వారిని అనుమతించాలి, జాగ్రత్తలు తీసుకునేలా సూచనలు ఇవ్వాలని కోరారు. మత రాజకీయాలు మానుకొని కొవిడ్19తో మరణించే ముస్లిం మరణాలపై మార్గదర్శకాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేల జీవో విడుదల చేసిన అధికారులను సస్పెండ్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: '16,002 పరీక్షల్లో 2 శాతం పాజిటివ్ కేసులు'