ఈ నెల 27న వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభ యథాతథంగా ఉంటుందని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. బహిరంగసభకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా... హాజరవుతారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రకు కోర్టు అనుమతి ఇస్తే... యాత్ర రూట్ మారే అవకాశం ఉంది. స్టేషన్ ఘనపూర్ నుంచి నేరుగా వరంగల్‌కు వెళ్లాలని నిర్ణయించినట్టు... పార్టీ వర్గాలు తెలిపాయి. బహిరంగ సభకు జనసమీకరణపై దృష్టి సారించినట్టు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల నేతలతో బండి సంజయ్ భేటీ అయ్యారు.
అసలేం జరిగిందంటే.. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేయాలని ఆదేశిస్తూ నిన్న వరంగల్ కమిషనరేట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో భాజపా పేర్కొంది. ప్రభుత్వ, రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు యాత్రను ఆపేందుకు నోటీసులు ఇచ్చారని పిటిషన్లో ఆరోపించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు రాజకీయ పార్టీలు పాదయాత్రలు చేయడం దేశంలో అత్యంత సాధారణమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు విపక్షాల నిర్మాణాత్మక విమర్శలను స్వీకరించాలన్నారు. కానీ ప్రభుత్వ ప్రోత్బలంతో పోలీసులు పాదయాత్ర ఆపివేయడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు డీజీపీ మౌఖికంగా అనుమతిచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. యాత్రకు ఇప్పటివరకు పోలీసులు యాత్రకు భద్రత కల్పించడంతో పాటు అన్ని విధాల సహకరించడమే అనుమతి ఉందనడానికి నిదర్శనం అని పేర్కొన్నారు.
రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని నోటీసులో పోలీసులు పేర్కొనడం నిరాదారమన్నారు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా రెచ్చగొట్టారో పోలీసులు స్పష్టం చేయడం లేదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఊహాజనితంగా పేర్కొనడం సమంజసం కాదన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో ఎక్కడా రెచ్చగొట్టే ప్రకటనలు కానీ దీక్షలు గాని చేయలేదని పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసును కొట్టివేయాలని.. యాత్రను ఆపవద్దని ఆదేశించాలని కోరారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, వరంగల్, కరీంనగర్ పోలీస్ కమిషనర్లు, ఇతర పోలీసు అధికారులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఇవీ చదవండి: