బల్దియా పీఠమే లక్ష్యంగా కమలనాథులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒకసారి అవకాశమిస్తే హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామంటూ ఓట్లు అభ్యర్ధిస్తున్నారు. ముషీరాబాద్ భాజపా అభ్యర్థి సుప్రియకు మద్దతుగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ ముషీరాబాద్, రాంనగర్ బొమ్మలగుడి , రామాలయం, పార్సిగుట్ట ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. మంత్రి సమక్షంలో పలువురు తెరాస నేతలు భాజపాలో చేరారు. హైదరాబాద్‌లో రెండు పడక గదుల ఇళ్ల పంపిణీలో వైఫల్యం చెందిన తెరాసకు బల్దియా ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే ఎంఐఎం, తెరాస పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
అభివృద్ధి కుంటుపడింది..
ఆసిఫ్ నగర్ డివిజన్ కమలం అభ్యర్థి లావణ్య బస్తీల్లో గడపగడపకు వెళ్లి ఆశీర్వదించాలని కోరారు. గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. నాచారం అభ్యర్థి అనిత డివిజన్ వ్యాప్తంగా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. వరద సాయం 25 వేలు అందిస్తామని భరోసా ఇచ్చారు. చర్లపల్లి మూడో డివిజన్‌లో భాజపా అభ్యర్థి సురేందర్ గౌడ్ పాదయాత్ర ద్వారా ఓట్ల వేట కొనసాగిస్తున్నారు. మేయర్ ఇలాఖాలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు.
భాజపాకు మద్దతివ్వాలని అభ్యర్థన
కార్వాన్ భాజపా అభ్యర్థి అశోక్... వాడవాడన తిరుగుతూ కమలానికే ఓటేయాలని కోరారు. పాతబస్తీ డివిజన్లలోనూ కమలం పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. మెహిదీపట్నం అభ్యర్థి గోపాలకృష్ణ సంతోష్ నగర్ కాలనీలో పాదయాత్ర నిర్వహించి భాజపాకు మద్దతివ్వాలని అభ్యర్థించారు.
ఇవీ చూడండి: 'కొడుకును సీఎం చేసేందుకు ఉద్యమకారులను బయటకు పంపుతున్నారు'