భాజపా కార్యకర్త గంగుల శ్రీనివాస్ సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం పట్ల కమలనాథులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్టు చేయగా... తీవ్ర మనస్తాపానికి గురై గంగుల శ్రీనివాస్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పేర్కొన్నారు.
శ్రీనివాస్ మరణం పట్ల బండి సంజయ్ తీవ్ర మనస్తాపం చెందారని తెలిపారు. అక్రమ అరెస్టులకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్, మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భాజపా శ్రేణులకు సూచించారు. కార్యకర్తలు ఎవరు ఆత్మహత్యకు యత్నించకూడదని... బతికుండి ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు. 2023 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.