Bio Asia Summit 2022 : బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు 2022 మొదటి రోజు విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్ వేదికగా బయో ఆసియా 19వ అంతర్జాతీయ సదస్సును కేటీఆర్ గురువారం దృశ్యమాధ్యమంలో ప్రారంభించి ప్రసంగించారు. ఏటా బయో ఆసియా సదస్సులో ఇచ్చే జినోమ్‌వ్యాలీ ప్రతిభా పురస్కారాన్ని ఈసారి అమెరికాలో ఉన్న పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన పిరల్‌మ్యాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అధిపతి ప్రొఫెసర్ డ్రూ వైస్మాన్‌కు మంత్రి సమర్పించారు. సాయంత్రం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గ్‌ేట్స్‌తో మంత్రి కేటీఆర్ నిర్వహించిన చర్చాకార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఆసక్తికర చర్చలు.. అవార్డుల ప్రదానం..
Bio Asia Summit 2022 Second Day : ఈ సదస్సు రెండో రోజులో భాగంగా.. ఆసక్తికర ప్యానల్ చర్చలు, అవార్డుల కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఫార్మా, బయో ఫార్మా రంగాల్లో ఇన్నోవేషన్ ఇంజిన్ అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లతో మొదటి సెషన్ ప్రారంభం కానుంది. ఈ చర్చలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు, సీసీఎంబీ, అరబిందో ఫార్మా, టాటా మెడికల్ అండ్ డయోగ్నస్టిక్స్ ప్రతినిధులు పాల్గొంటారు. వచ్చే ఐదేళ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలో ఆవిష్కరణలపై వీరు చర్చిస్తారు. డ్రగ్ రీసెర్చ్ అండ్ అభివృద్ధి గతంలో- నేడు అనే అంశంపై మరో చర్చ జరగనుంది. ఇందులో బయోకాన్, డాక్టర్ రెడ్డీస్, జైడస్ క్యాడిలా, భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ ప్రతినిధులు పాల్గొంటారు.
రెండో రోజు చర్చలు..
Bio Asia Summit 2022 Sessions : బయో ఆసియా సదస్సు రెండో రోజు జాన్సన్ అండ్ జాన్సన్ ఎక్జిక్యూటివ్ ఛైర్మన్ అలెక్స్ గోర్ స్కీ ఉపన్యాసం ప్రముఖంగా నిలవనుంది. ఈయనతో తెలంగాణ రాష్ట్ర లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తినాగప్పన్ ఫైర్ సైడ్ చాట్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం సెషన్‌లో సప్లై చైన్ వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, తయారీ పెంపొందించేందుకు అవలంబించాల్సిన పద్ధతులు, క్వాలిటీ ఫోకస్ వంటి అంశాలపై ప్యానల్ చర్చ సాగనుంది. ఈ చర్చలో పలు దేశీయ, విదేశీ ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్నారు.
అలా ముగుస్తుంది..
Bio Asia Summit 2022 Panel Discussions : కరోనా విధ్వంసం తర్వాత నియమనిబంధనలు ఏవిధంగా మార్పు చెందాయనే అంశంపై మరో ప్యానల్ చర్చ జరగనుంది. ఈ చర్చలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, యూఎస్‌కు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధులు పాల్గొననున్నారు. నాలుగు గంటలకు సీఈవో కాంక్లేవ్ జరగనుంది. ఇందులో పిరమిల్ గ్రూప్, సన్ ఫార్మా, జైడస్ క్యాడిలా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్‌ల సీఈవోలు పాల్గొంటారు. రెండో రోజు చివర్లో ఫ్యాబా అవార్డులు, వాలిడిక్టరీ సెషన్ ద్వారా బయో ఆసియా సదస్సు ముగుస్తుంది.