Ganesh Immersion in Hyderabad : భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి హుస్సేన్ సాగర్ వద్ద నిర్వహించిన బైక్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ర్యాలీకి అనుమతి లేదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావుతో పాటు పలువురు నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. హుస్సేన్ సాగర్‌లో గతంలో మాదిరిగా గణేశ్ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బైక్ ర్యాలీని నిర్వహించారు. నిమజ్జనం ఇంకా మూడు రోజులే ఉన్నప్పటికీ ట్యాంక్ బండ్ పై ఇప్పటికీ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు అన్నారు. ఏ కోర్టు ట్యాంక్ బండ్లో నిమజ్జనం చెయొద్దని చెప్పిందో ఉత్తర్వులు చూపాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే ట్యాంక్ బండ్ పై వినాయకుల నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలన్నారు.
విగ్రహాలతో రోడ్లను దిగ్బంధిస్తాం.. అనంత చతుర్దశి రోజైన ఈనెల 9న హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనం జరుగుతుందని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డా.భగవంత్‌రావు తెలిపారు. గురువారం జరుగుతుందని కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. సిద్దింబర్‌బజార్‌లోని బాహెతీభవన్‌లో గల భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. నిమజ్జనానికి సరైన ఏర్పాట్లు చేయకుంటే శుక్రవారం రోడ్లపై విగ్రహాలతో ఎక్కడికక్కడ దిగ్బంధం చేస్తామని హెచ్చరిక జారీ చేశారు. భక్తులను నగరంలో అక్కడక్కడా ఏర్పాటు చేసిన పాండ్స్ దగ్గరకు వెళ్లనివ్వకుండా.. గణేశ్ విగ్రహాలను చెత్తలో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనానికి ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వానికి బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్, మొహరం పండుగల మీద ఉన్న ఆసక్తి గణేష్ ఉత్సవాలపై లేదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మండిపడింది.