ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ కూల్చివేతల గురించి మాట్లాడటం చాలా సిగ్గుచేటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తులు వాళ్లని కొనియాడారు. ఓ వర్గం ఓట్లు పోతాయని కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్, పీవీ కాలి గోటి కిందికి మజ్లిస్ పార్టీ సరిపోదన్నారు.
" తెలుగుజాతి గౌరవానికి పీవీ, ఎన్టీఆర్ ప్రతీకలు. వారు ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలు పొందారు.ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలు ధరించి పాలించారనే మజ్లిస్ వ్యతిరేకిస్తోంది. పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చేస్తామంటే కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు. పీవీ జయంతి ఉత్సవాలు జరపడం కాదు.. గౌరవాన్ని కూడా కాపాడాలి. చిత్తశుద్ధి ఉంటే ఘాట్‌ను కూల్చుతామన్న వారిని అరెస్టు చేయాలి.
కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు. శాంతియుత వాతావరణంలో గ్రేటర్ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. శాంతి భద్రతల పేరుతో సీఎం కేసీఆర్ నాటకాలాడుతున్నారు. కుట్రలపై పక్కా సమాచారం ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాస కనుమరుగుకాబోతోంది. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతాం." - బండి సంజయ్
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబేడ్కర్ విగ్రహానికి ఒక్క రోజు కూడా నివాళి అర్పించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆక్షేపించారు. రాజ్యాంగ దినోత్సవం రోజు కూడా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించలేదని బండి విమర్శించారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సంజయ్ నివాళులర్పించారు. నగరంలో 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేస్తామని చేయలేదన్నారు. భాజపా జీహెచ్‌ఎంసీ మేయర్ స్థానాన్ని దక్కించుకున్నాక.. దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : 'విద్వేషాలు రెచ్చగొట్టే వారికి నగరంలో చోటులేదు'