Kishan Reddy On CM Kcr: తెరాస జాతీయపార్టీగా మారనుందన్న ముఖ్యమంత్రి ప్రకటనపై భాజపా నేతలు స్పందించారు. ప్రజల్ని మరోసారి మభ్యపెట్టేందుకే బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ కొత్త పల్లవి అందుకున్నారని వారు విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా భాజపాపై సీఎం కేసీఆర్ విషం కక్కుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తెరాస వైఫల్యాల నుంచి జనం దృష్టి మరల్చేందుకే జాతీయ పార్టీ అంటూ కొత్త పల్లవి అందుకున్నారని ఎద్దేవా చేశారు.
'ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో రాజకీయ నాయకులు ఎక్కువైపోయారు. అందుకోసమే జాతీయ పార్టీ పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఆయన కుటుంబానికి రాష్ట్రం సరిపోక.. దేశాన్ని పంచుకోవాలని చూస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా భాజపాపై సీఎం కేసీఆర్ విషం కక్కుతున్నారు. తెరాస వైఫల్యాల నుంచి జనం దృష్టి మరల్చేందుకే జాతీయ పార్టీ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.'-కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
టైం పాస్ పాలిటిక్స్ చేయడంలో కేసీఆర్ దిట్ట..
Bandi Sanjay Comments: ప్రపంచ దేశాలు మోదీ.. మోదీ.. అంటుంటే... ముఖ్యమంత్రి కేసీఆర్ను రోగి.. రోగి.. అంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెడతారనే వార్తలపై ఆయన స్పందించారు. టైం పాస్ పాలిటిక్స్ చేయడంలో కేసీఆర్ దిట్ట అని విమర్శించారు. రాష్ట్రాన్ని కులాల, మతాల పేరుతో విచ్ఛిన్నం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఆ నేరం వేరే వారిపై వేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణకు ఏమి చేయలేని కేసీఆర్... దేశానికి ఏం చేస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కుటుంబానికి అప్పగించి... అక్కడికి వెళ్తున్నారా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని మోసం చేసిన కేసీఆర్... దేశాన్ని మోసం చేయడానికి వెళ్తున్నారా అని విమర్శించారు. దేశంలో కుటుంబ పాలన చేసే పార్టీలకు స్థానం లేదని.. గ్రహించాలని హితవు పలికారు. దేశంలో కుటుంబ పాలన ఉన్న పార్టీలు అంతమొందాయని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. ఎనిమిది సంవత్సరాల మోదీ పాలన, ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నామని... ఇక్కడ అవినీతి మయమైన కుటుంబ పాలన సాగుతుందని బండి సంజయ్ ఆరోపించారు.
ప్రజల్ని మరోసారి మభ్యపెట్టేందుకే బీఆర్ఎస్..
Laxman Comments on KCR National party: ప్రజల్ని మరోసారి మభ్యపెట్టేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు తెరాసకు ఇప్పటికే వీఆర్ఎస్ ఇచ్చారని... ఎవరెన్ని కుట్రలు చేసినా దేశానికి మరోసారి నరేంద్ర మోదీయే ప్రధాని అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంబీసీలను చులకనగా చూస్తున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీసీ రుణాలు ఆటకెక్కాయని మండిపడ్డారు. తెలంగాణలో నిధులు లేక కార్పొరేషన్లు మూగబోయాయని ఆరోపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంబీసీ కులాల సదస్సులో లక్ష్మణ్ మాట్లాడారు.
రాష్ట్రంలో 54శాతం ఉన్న ఓబీసీలకు కేవలం మూడే మంత్రి పదవులు ఇచ్చారని అగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా కేసీఆర్ సామాజిక న్యాయమని ప్రశ్నించారు. ఎంబీసీ వర్గాలకు భాజపా అండగా ఉందని... రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు. భాజపా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ప్రత్యేక ఫెడరేషన్‌లు ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామన్నారు. కేసీఆర్ రాచరిక, కుటుంబ పాలనను ఓబీసీలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి:KTR in Khammam Tour : 'దేశంలో ఈ పరిస్థితులకు కారణమెవరు..?'