ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని భజరంగ్ దళ్ తెలంగాణ శాఖ డిమాండ్ చేసింది. ప్రేమికుల రోజుకు విరుద్ధంగా ప్రజలను చైతన్య పరిచేందుకు... భజరంగ్ దళ్ నాయకులు హైదరాబాద్ హైదర్గూడాలో గోడ పత్రికను ఆవిష్కరించారు. వాలెంటైన్స్ డే అనే విష సంస్కృతి మనది కాదనీ... దాని వల్ల యువత పక్కదారి పడుతున్నారని బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్ తెలిపారు. పార్కులు, పబ్బులకు పోయి విశృంఖల పనులకు పాల్పడటం ప్రేమ అనిపించుకోదన్నారు.
అదే రోజున మనకోసం... మన దేశ భద్రత కోసం... ప్రాణాలర్పించి అమరులయిన సీఆర్పీఎఫ్ జవాన్లను గుర్తు చేసుకుంటూ అమరవీర్ జవాన్ దివాస్ జరుపుకోవాలని కోరారు. ఈ నెల 12న గ్రీటింగ్స్ దహనం కార్యక్రమం ఉంటుందని... 14న ఉదయం అమరవీరులకు రాష్ట్ర వ్యాప్తంగా నివాళులర్పించనున్నట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం ప్రజలను చైతన్య పరుస్తూ... నెక్లెస్ రోడ్డులో కాగడాల ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ప్రతి ఏడాదిలాగే ఆ రోజున కూడా... ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో కనబడితే తమ పని తాము చేస్తామని స్పష్టం చేశారు.