నిహాల్... సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలో ఐదో తరగతి చదువుతున్నాడు. తన పుట్టినరోజు వేడుకలకు కొంతమంది స్నేహితులను ఇంటికి ఆహ్వానించాడు. వారి మధ్య జరిగిన సంభాషణ నిహాల్‌లో కొత్త ఆలోచన రేకెత్తించింది. వేడుకలకు వచ్చిన మిత్రులు తన ఇంట్లోని మరుగుదొడ్లను వాడుకున్నారు. వారిలో ఒకరు తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా సోకిందని చెప్పడంతో నిహాల్ ఖంగుతిన్నాడు.
తల్లిదండ్రుల సాయంతో..
చేతులు శుభ్రం చేసుకోవడం, శానిటైజర్ వినియోగించడం ఎంత కీలకమో... మరుగుదొడ్లను శానిటైజ్ చేయడమూ అంతే కీలకమనుకున్నాడు . తనలో సృజనాత్మకతకు పదునుపెట్టి గురువులు, తల్లిందడ్రుల సాయంతో సరికొత్త పరికరాన్ని రూపొందించాడు.
నెల రోజుల్లోనే..
నెలరోజుల పాటు కృషిచేసిన పదేళ్ల నిహాల్.. ఆటోమెటిక్ టాయిలెట్ శానిటైజర్‌ను తయారుచేశాడు. ఆ ఆలోచనను.. ఉపాధ్యాయుడు కిషోర్, తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అతన్ని ప్రోత్సహించారు. అంతే.. నెల రోజుల్లో ఆ బాలుడు ఆటోమేటిక్ టాయిలెట్ శానిటైజర్‌ను ఆవిష్కరించాడు.
ఒక్క మీట నొక్కితే చాలు..
అసెంబ్లింగ్, ప్రోగ్రామింగ్ ద్వారా ఇది పనిచేస్తోంది. ఒక్క మీట నొక్కితే చాలు మరుగుదొడ్లు పూర్తిగా శానిటైజ్ అయిపోతాయంటున్నాడు నిహాల్. రద్దీ ఎక్కువగా ఉండే విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, సినిమా హాళ్లు, పాఠశాలలు, కళాశాలలు, షాపింగ్‌మాళ్లలో దీన్ని వినియోగిస్తే వైరస్ వ్యాపించకుండా ఉంటుందని చెబుతున్నాడు.
మరిన్ని ఆవిష్కరణలకు నాంది..
టాయిలెట్ శానిటైజర్ ఆవిష్కరించాలని తమ కుమారిడిలో ఏర్పడిన తపనను గమనించి ప్రోత్సహించినట్టు తల్లిదండ్రులు వివరించారు. భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని భావిస్తున్నట్టు నిహాల్ చెబుతున్నాడు.