ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ప్రాంతంలో ఓ వ్యక్తిపై పలువురు అత్యంత పాశవికంగా దాడి (attack at guntur) చేశారు. పట్టణ శివారులో రోడ్డు డివైడర్‌పై పడేసి కొందరు వ్యక్తులు కాళ్లూ చేతులు పట్టుకోగా..మరో వ్యక్తి కిరాతకంగా బండరాయితో మోదాడు. దెబ్బలు తాళలేక బాధితుడు విలవిల్లాడుతున్నా..ఏ మాత్రం కనికరం లేకుండా చావబాదారు. రాడ్లు, జాకీలతోనూ విచక్షణారహితంగా దాడికి తెగ బడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువుకు చెందిన సైదాగా గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 వాహనంలో నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
'ఓ వివాహ వేడకకు హాజరై తిరిగి ఇంటికి వస్తుండగా నాపై దాడి చేశారు. మేం మొదటి నుంచీ తెదేపాలో పనిచేస్తున్నాం. గతంలో పార్టీల వ్యవహారం, పొలం గట్ల వివాదం మా మధ్య ఉంది. శివారెడ్డి, హేమంత్ రెడ్డి, పున్నారెడ్డి, ప్రతాప్ రెడ్డి, అన్నపురెడ్డి నాపై దాడి చేశారు. వీరితో పాటు నరసరావుపేటకు చెందిన పలువురు వ్యక్తులు దాడి చేశారు.'
- సైదా
కక్షతోనే దాడి...
దాడి ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అరాచకాల్లో ఆంధ్రప్రదేశ్ అఫ్గానిస్థాన్‌ను మించిపోయిందని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల్లో తెదేపా ఏజెంట్‌గా పనిచేశారనే కక్షతో సైదాపై దాడికి దిగారని ఆయన మండిపడ్డారు. సైదాపై వైకాపా రౌడీమూకలు నరరూప రాక్షసుల కంటే ఘోరంగా దాడి చేయడం చూస్తే ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి అర్థమవుతోందన్నారు.
తాలిబన్లను మించిపోతున్నారు..
తెదేపా కార్యకర్త సైదాపై వైకాపా మూకల దాడిని తెదేపా ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఖండించారు. వైకాపా నేతల అరాచకాలు తాలిబాన్లను మించిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా అరాచక మూక ఉగ్రవాదుల కంటే దారుణంగా తయారయ్యారని దుయ్యబట్టారు.
ఇదీచూడండి: డ్రైనేజీ పైపులో నోట్ల కట్టలు దాచిన 'అవినీతి' అధికారి