ఏపీలోని విశాఖపట్నం విమానాశ్రయంలో 2017 జనవరి 26న పోలీసులు అడ్డుకున్న ఘటనలో సభాహక్కులకు గానీ, పార్లమెంటు సభ్యుడిగా విజయసాయిరెడ్డి హక్కులకు కానీ ఎలాంటి భంగం వాటిల్లలేదని సభాహక్కుల సంఘం తేల్చింది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నేతృత్వంలోని కమిటీ ఈ మేరకు పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. విశాఖపట్నం విమానాశ్రయంలో పోలీసు అధికారులు తనను చట్టవిరుద్ధంగా నిర్బంధించడంతోపాటు, దుర్భాషలాడుతూ చేయిచేసుకున్నట్లు’’ విజయసాయిరెడ్డి అదే ఏడాది జనవరి 31న చేసిన ఫిర్యాదుపై కమిటీ విచారణ చేపట్టి నివేదిక సమర్పించింది.
ది పార్లమెంటు విధుల్లోకి రాదు..
రాష్ట్రానికి ప్రత్యేకహోదాను డిమాండ్ చేస్తూ జనవరి 26న తలపెట్టిన చలో ఆర్కే బీచ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయసాయిరెడ్డి విశాఖపట్నం వెళ్లారని, అది పార్లమెంటు విధుల్లోకి రానందున ఆయనకు సభాహక్కుల సంరక్షణ ఉండదని పేర్కొంది. పోలీసులు తనపై చేయిచేసుకున్నట్లు విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలేమీ లభించలేదని వెల్లడించింది. అయితే కమిటీ దాన్ని పూర్తిగా కొట్టిపారేయలేదని అభిప్రాయపడింది. పార్లమెంటు సభ్యులతో వ్యవహరించాల్సిన తీరుపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ పోలీసు సంస్థలు ఎంపీలతో సరిగా వ్యవహరించడం లేదని, ఇది బాధాకరమని కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మార్గదర్శకాలను పోలీసు అధికారులు తప్పనిసరిగా అనుసరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని, దీనిపై వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సిఫార్సు చేసింది.